• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో గణతంత్ర దినోత్సవాలు జరిగాయి. నిజానికి చంద్రబాబునాయుడు కోసం మొత్తం కార్యక్రమాల షెడ్యూలును మార్చారు. కానీ.. పరిస్థితులు ప్రతికూలించాయి. బాబు రాలేకపోయారు. ఆయనకోసమే కార్యక్రమాన్ని ఆపారు గానీ.. ఆయన మాత్రం గైర్హాజరయ్యారు.

ఇంతకూ విషయం ఏంటంటే... తెలుగు రాష్ట్రం రెండుముక్కలు అయిన నాటినుంచి అప్పటి గవర్నర్ నరసింహనే రెండు రాష్ట్రాలకు తానే గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్ జాతీయ పతాకావిష్కరణ చేయడం సాంప్రదాయం. అయితే నరసింహన్ మాత్రం, తొలినుంచి ఆంధ్రప్రదేశ్ లోనే తొలుత పతాకావిష్కరణ చేసి.. ఆ తర్వాత తెలంగాణకు వచ్చి.. ఇక్కడ పతాకావిష్కరణ చేస్తున్నారు. అదే సాంప్రదాయం కొనసాగుతోంది. ఆ రకంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కే తన తొలిప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు.

అయితే ఈసారి ఆ ప్రాధాన్యం కూడా లేకుండాపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో లేకపోవడంతో.. జెండావందనం కార్యక్రమంలో కొంతమార్పులు చేశారు. దావోస్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడినుంచి తిరిగి అమరావతి చేరేసరికి ఆలస్యం అయిపోతుందనే ఉద్దేశంతో.. గవర్నరుకు ముందుగా సమాచారం పంపి.. ముందుగా తెలంగాణ జెండావందనంలో పాల్గొని, ఆతర్వాత బెజవాడ వచ్చేలా ప్లాన్ చేశారు. ఆ రకంగా బాబు కోసం అంతా ఆపారు. ఇంతచేసినా.. చంద్రబాబు మాత్రం రాలేకపోయారు.

అనుకున్న ప్రకారం అయితే.. ఆయన శుక్రవారం ఉదయం 6.45కు హైదరాబాదు వచ్చి... అటునుంచి విజయవాడకు రావాలి. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం వాతావరణ పరిస్థితుల వల్ల బాగా ఆలస్యం అయింది. అబుదాభి నుంచి ఢిల్లీ చేరుకునే సరికే మధ్యాహ్నం 2.45 అయింది. అక్కడినుంచి ఆయన బెజవాడకు వచ్చారు. తెలంగాణ కార్యక్రమం తర్వాత బెజవాడకు వచ్చిన గవర్నరు ముఖ్యమంత్రి లేకుండానే.. జెండావందనం చేసేసి.. తన అధికారిక కార్యక్రమం ముగించుకుని వెళ్లారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.