• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

విశాఖ పట్టణానికి రైల్వే జోన్ కావాలన్నది ఏపీ రాష్ట్ర వాసుల కల. విభజన సమయం నుంచి దాన్ని కూడా ఏపీకి వరంగా ప్రసాదిస్తాం అంటూ కేంద్రం ఊరిస్తున్నది. ఆ తర్వాత అనేక పర్యాయాలు రైల్వే జోన్ గురించి.. విన్నపాలు చేసుకున్నప్పటికీ.. మోడీ సర్కారు మాత్రం పట్టించుకోకుండా వదిలేసింది.

మొన్నటికి మొన్న 12వ తేదీన మోదీతో సమావేశం అయినప్పుడు కూడా విశాఖ రైల్వే జోన్ గురించి విన్నవించినట్లు చంద్రబాబునాయుడు మీడియాకు చెప్పారు. అయితే రోజులు గడవలేదు.. అప్పుడే.. తెలుగుదేశానికే చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి... అపశకునాలు పలుకుతున్నారు. కేంద్రం చేస్తున్న వంచనకు ఈయన ఆమోదముద్ర వేస్తున్నట్లుగా, వారి చర్యలను సమర్థిస్తునట్లుగా తాజా మాటలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యం కాదనే ఇప్పటిదాకా అనేక నివేదికలు వెల్లడించాయని సుజనా చౌదరి మీడియాకు వెల్లడించారు. అసలే ఒక వైపు రైల్వే బడ్జెట్ తయారవుతున్న తరుణంలో.. ఏపీకి చెందిన భాజపా ఎంపీలు కూడా రైల్వేజోన్ కోసం కేంద్రానికి లేఖలు రాసి.. తామేదో సాధించేస్తున్నట్లుగా ఇక్కడ లోకల్ గా జనానికి బిల్డప్ లు ఇచ్చుకుంటూ కాలం నెట్టేస్తున్న సమయంలో కేంద్రంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సుజనా చౌదరి.. తాను ఏపీ ప్రజల కోసం కాకుండా, కేంద్ర ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లుగా మాట్లాడడం చోద్యంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

సుజనా చౌదరిని రాష్ట్ర అవసరాలకోసం కేంద్రం వద్దకు రాయబారం పంపితే.. అది ఎంతటి కార్యమైనా సరే.. సర్వనాశనం అయిపోవడం గ్యారంటీ అనే అభిప్రాయాలు ప్రజల్లో కలుగుతున్నాయి. గతంలో ప్రత్యేకహోదా గురించి ప్రజలంతా అంగలారుస్తున్న వేళ.. హోదా అనేది వచ్చే అవకాశమే లేదు.. అంటూ తెదేపా తరఫున సుజనా చౌదరే మొదట అపశకునాల ప్రచారం ప్రారంభించాడు.

ఆ తర్వాత.. ప్రత్యేక ప్యాకేజీ చర్చల్లో ఆయనే పాల్గొన్నాడు. ప్యాకేజీ అనేది మహాద్భుతం అనే మోసపూరిత మాటలను కూడా తొలుత ఆయనే ప్రారంభించాడు. ఆ ప్యాకేజీ ఏంటో.. అది విదిల్చగల భిక్షం ఏపాటిదో ఇవాళ్టి దాకా ప్రజలకు అర్థం కాలేదు. తీరా ఇప్పుడు.. రైల్వేజోన్ కోసం అందరూ ఆశిస్తోంటే.. కేంద్రం వంచించడానికంటె ముందే.. సుజనా అపశకునాలు పలికేస్తున్నారని.. కేంద్రానికి ఎలా తిరస్కరించాలో.. ఆయనే ఓ మార్గం చూపిస్తున్నారని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.