• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రముఖ 'టైమ్' మ్యాగజైన్ సైతం ఇప్పుడు 'డన్ క్రిక్' ఒక అద్భుతమైన సినిమా అంటూ తన రివ్యూతో ఆకాశానికి ఎత్తేసింది. అయితే క్రిస్టోఫర్ నొలన్ గత సినిమాలను చూసినవారందరూ.. ఈ సినిమాలో ఏముందబ్బా అంటూ నాలుక కరుచుకుంటున్నారు. ఇన్సెప్షన్.. ఇంటర్ స్టెల్లార్ వంటి సినిమాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఈ సినిమాల్లో లేదు కదా.. మరెలా ఈ సినిమా గొప్ప సినిమా అవుతుంది అనేది వారి వాదన. మరి హాలీవుడ్ క్రిటిక్స్ ఈ డన్ క్రిక్ ను ఎందుకు పొగుడుతున్నారంటే..

ఎప్పుడూ కూడా ఇంటెలిజన్స్ పైన రూపొందిన సినిమాలను అక్కడ పెద్దగా గొప్ప సినిమాలుగా అభివర్ణించరు. అలాగే బాక్సాఫీస్ కలక్షన్లు అద్భుతంగా వచ్చినా కూడా ఆ సినిమాలను గొప్ప సినిమాలని చెప్పరు. ట్రాన్స్ ఫార్మర్స్ 4 వంటి సినిమాలు కలక్షన్లను దంచేసినా కూడా.. ది కింగ్స్ స్పీచ్.. 13 ఇయర్స్ ఏ స్లేవ్ వంటి సినిమాలకే ఆస్కార్లు వరిస్తాయి. ఇప్పుడు నొలన్ విషయానికొస్తే.. మనోడు తీసిన ఇన్సెప్షన్.. డార్క్ నైట్.. ఇంటర్ స్టెల్లార్ సినిమాలకు సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీల్లో అవార్డులు అనేకం వరించాయి కాని.. ఉత్తమ సినిమా ఉత్తమ దర్శకుడు అవార్డులు దక్కలేదు. ఈ కేటగిరీలో నామినేషన్లు కూడా చాలా తక్కువసార్లే దక్కాయి. ఎందుకంటే నొలన్ తీసేవి మసాలా మూవీస్ క్రింద అక్కడి క్రిటిక్స్ అభివర్ణిస్తారు.

కాని 'డన్ క్రిక్' సినిమాలో మాత్రం.. మొత్తంగా ఎమోషనే ఉంటుంది. ఒక బీచ్ లో చిక్కుకుపోయిన లక్షలమంది సైన్యాన్ని రెండో ప్రపంచ యుద్దం టైములో ఎలా కాపాడారు అనేదే ఈ కథ. కేవలం ఏమోషన్లే నిండిపోయాయ్. పైగా విజువల్ ఎఫెక్ట్స్ తక్కువ స్థాయిలో వాడేసి.. నిజమైన రెండో ప్రపంచం నాటి విమానాల్లోనూ.. అలాగే అప్పట్లో డన్ క్రిక్ లో సేనలను కాపాడిన కొన్ని నౌకలను వాడి.. నిజంగా డన్ క్రిక్ బీచులోనే మనోడు సినిమా తీశాడు. ఒక గ్రీన్ స్క్కీన్ లో షూట్ చేసి.. వెనుక అంతరిక్షం అంటూ బొమ్మలు మార్చినదానికి.. ఇప్పుడు నిజంగా రియల్ లొకేషన్లో రియల్ ఫీల్ తో తీసిన షాట్లకు అక్కడి క్రిటిక్స్ ముగ్దులవుతున్నారు. అందుకే డన్ క్రిక్ ను వారు గ్రేట్ సినిమా అంటూ పొగిడేశారు. 

గతంలో రెండో ప్రపంచ యుద్దం వాతావరణంలో దర్శకుడు స్పీల్ బర్గ్ ఎన్నో అద్భుతమైన సినిమాలను తీశాడు. సేవింగ్ ప్రైవేట్ ర్యాన్.. షిండ్లర్స్ లిస్ట్ వంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోయే ఆణిముత్యాలు. ఇప్పుడు 'డన్ క్రిక్' సినిమాను కూడా వాటి సరసన పెడుతున్నారు హాలీవుడ్ సినిమా పెద్దలు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.