• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

సినిమా : అజ్ఞాతవాసి
నటీనటులు : పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్, ఖుష్బూ,ఆది పినిశెట్టి , బొమ్మన్ ఇరానీ , రావు రమేష్ , మురళీ శర్మ తదితరులు
రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాత : ఎస్.రాధాకృష్ణ
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : వి.మనికందన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : హారికా&హాసినీ క్రియేషన్స్
రిలీజ్ డేట్ : 10-01-2017

యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆ సమయం రానే వచ్చేసింది. ఈ ఏడాదిలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా చెప్పుకుంటూ వస్తున్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తర్వాత ముచ్చటగా మూడోసారి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తుండడంతో ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. పైగా ప్రోమోలు విపరీతంగా ఆకట్టుకోవడం, పాటలు కూడా అలరించడంతో.. మూడోసారి కూడా ఈ జంట ఆడియెన్స్‌ని మైమరిపించడం ఖాయమనే అభిప్రాయాలు వెలువడ్డాయి. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో ‘అజ్ఞాతవాసి’ సక్సెస్ అయ్యిందా? లేదా? వేచి చూడాల్సిందే.

కథ : అభిజిత్ భార్గవ్ (పవన్ కళ్యాణ్) ఓ కోటీశ్వరుడి కొడుకు. కొన్ని కారణాల వల్ల అభిజిత్ తండ్రికి అస్సాంలో పెంచబడతాడు. కట్ చేస్తే.. కొన్ని సంవత్సరాల తర్వాత అభిజిత్‌ తండ్రిని, తమ్ముడిని చంపేసి.. ఆస్తిని, బిజినెస్‌ని స్వాధీనం చేసుకుంటారు కొందరు దుండగులు. ఈ విషయం తెలుసుకున్న భార్గవ్ తిరిగి వస్తాడు. తండ్రిని, తమ్ముడ్ని చంపినవాళ్లని అంతమొందించి.. వాళ్లు అదుపులోకి తీసుకున్న తండ్రి బిజినెస్‌ని తిరిగి పొందేందుకు పన్నాగాలు పన్నుతాడు. ఇంతకీ అభిజిత్ తండ్రి, అతని తమ్ముడ్ని చంపిందెవరు? అభిజిత్ తన పగని ఎలా తీర్చుకున్నాడు? అందుకుగాను అతను వేసిన ఎత్తుగడలు ఏంటి? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ : త్రివిక్రమ్ ఎంచుకునే స్టోరీలైన్ రొటీన్ అయినప్పటికీ.. దాన్ని ఆయన వెండితెరపై తీర్చిదిద్దే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆసక్తి రేకెత్తించే స్ర్కీన్‌ప్లే, కడుపుబ్బా నవ్వించే కామెడీ, డిఫరెంట్ లవ్ ట్రాక్‌, హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌, మనసుని హత్తుకునే ఎమోషన్స్, బరువైన డైలాగ్స్‌.. ఇలా అన్నింటిని కలగలిపి ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తారు. ‘అజ్ఞాతవాసి’ సినిమాని కూడా అలాంటి మిక్సింగ్‌తోనే రూపొందించాడు త్రివిక్రమ్. ఎప్పట్లాగే తన పంథాలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యాడు త్రివిక్రమ్.

ఫస్టాఫ్ విషయానికొస్తే.. గూస్‌బంప్స్ తెప్పించే పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సినిమా స్టార్ట్ అవ్వగా, మిగతాదంతా రొమాంటిక్ – కామెడీ ట్రాక్స్‌తో సినిమా సరదాగా సాగుతుంది. మధ్యలో పూనకాలు తెప్పించే కొన్ని సీన్లు అరుపులు అరిపించేశాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి. మొదటి భాగాన్ని పవన్ తన చరిష్మాతో నడిపించాడు. హీరోయిన్లతో లవ్ ట్రాక్, ఆఫీస్‌లో చేసే కామెడీ అదిరింది. పాటలు, వాటిని పిక్చరైజేషన్ చేసిన విధానం మైండ్‌బ్లోయింగ్. ఇలా ఎంటర్టైనింగ్‌గా సాగుతూ.. ఓ దిమ్మతిరిగే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండాఫ్‌లో సినిమా కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. పవన్ తన పగ తీర్చుకునేందుకు వేసే ఎత్తుగడలు, యాక్షన్ సీన్స్ అరాచకం అంతే! అక్కడక్కడ వచ్చే కామెడీ ఎపిసోడ్స్ బాగా నవ్వించాయి. సెకండాఫ్‌లో త్రివిక్రమ్ తన పెన్నుకి బాగా పనిచెప్పాడు. అదిరిపోయే డైలాగ్స్‌తో వాహ్ అనిపించాడు. ఇక ఎప్పట్లాగే త్రివిక్రమ్ ఎమోషనల్‌గా చిత్రాన్ని ముగించాడు.

ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్‌లో కొన్ని యాక్షన్ సీన్స్, కామెడీ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు, ఎమోషనల్ ఎండింగ్ హైలైట్. అక్కడక్కడ వచ్చే కొన్ని ఓవరాక్షన్ సీన్లు ఎబ్బేట్టుగా అనిపిస్తాయి. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించినా.. జనాలకి కన్విన్స్‌గా అనిపించదు. అలాగే కొన్నిచోట్ల సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సెకండాఫ్ చాలావరకు ‘అత్తారింటికి దారేది’ని తలపిస్తుంది. వాటిని లైట్ తీసుకుంటే.. ఇదో బ్లాక్‌బస్టర్ మూవీనే.

నటీనటుల ప్రతిభ :
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనలో మరో కోణాన్ని చూపించాడు. ఆడియో ఈవెంట్‌లో త్రివిక్రమ్ చెప్పినట్లుగానే తనలో విశ్వరూపం చూపించాడని చెప్పుకోవచ్చు.ఈ చిత్రానికి ఏదైతే కావాలో ఈ కంటెంట్‌ని చూపించడంలో మాత్రం వంద మార్కులు వేయించుకున్నాడు పవన్. మొదటినుంచి చివరివరకు కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా సినిమాని ఇంటిచేత్తో నడిపించాడు. ఇక హీరోయిన్స్ ఇద్దరూ అందంగా కనిపిస్తూనే ఉన్నంతగా అభినయం కనబరిచారు. నటనపరంగా కంటే గ్లామర్ పరంగా నువ్వా-నేనా అన్నట్లుగా పోటీపడ్డారు.

ఇక కీలకపాత్రలో నటించిన ఖుష్బూ తనదైన నటనాశైలితో ఈ చిత్రానికి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. ఆ పాత్రకి ఆమె తప్ప మరెవ్వరూ సరిపోనంతగా అద్భుత అభినయం కనబరిచింది. బొమన్ ఇరానీ, రావు రమేష్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. ఆల్రెడీ ఇద్దరూ విలక్షణ నటులుగా పేరుగాంచారు. వీరితోపాటు మురళిశర్మ, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్ ఎప్పట్లాగే అదరగొట్టేశారు. ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఆది పినిశెట్టి గురించి. ఇప్పటికే మనోడు ప్రతిపాత్రలో ఒదిగిపోయే పర్ఫెక్ట్ నటుడిగా పేరుగాంచాడు. ఇక ఇందులోనూ మరింత రెచ్చిపోయాడు. ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

ఫైనల్‌గా మరో ట్విస్ట్.. ఇన్నాళ్లూ పుకార్లు షికారు చేస్తూ వచ్చినట్లుగా ఇందులో ఒక స్టార్ హీరో తళుక్కున మెరిశాడు. ఆ హీరో ఎవరో తెరమీద మీరే చూస్తే బాగుంటుంది.

టెక్నికల్ పెర్ఫార్మెన్స్ :
ట్రైలర్‌లోనే వి.మనికందన్ సినిమాటోగ్రఫీ ఎంత రిచ్‌గా ఉందో చూశాం. సినిమా మొత్తంలో అదే రిచ్‌నెస్‌తో తన కెమెరా పనితనం చాటిచెప్పాడాయన. అనిరుధ్ పాటలు ఆల్రెడీ హిట్ అయ్యాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా.. పవన్‌ని ఎలివేట్ చేస్తూ ఇచ్చిన మాస్ బీట్ గూస్‌బంప్స్ అంతే! ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ బాగున్నాయి. రాధాకృష్ణ నిర్మాణ విలువలు భేష్. ప్రతి పైసా ఖర్చు వెండితెరపై కనిపిస్తుంది. ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే.. ఈయన ఎంచుకునే స్టోరీలైన్స్ సింపుల్‌గా ఉన్నప్పటికీ తనదైన స్ర్కిన్‌ప్లే మ్యాజిక్, మాటల మంత్రాలతో మాయ చేసేస్తాడు. ‘అజ్ఞాతవాసి’ మూవీలోనూ అదే రిపీట్ చేసి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అన్నీ సరిసమానంగా కలగలిపి.. ఎమోషనల్ కంటెంట్‌తో మనసుల్ని హత్తుకున్నాడు. పవన్ ముందుండి సినిమాని నడిపిస్తే.. కెమెరావెనకాల త్రివిక్రమ్ పిల్లర్‌లా నిలిచాడు.

ఫైనల్ వర్డ్ : ‘అజ్ఞాతవాసి’ చర్యలు నిజంగా ఊహాతీతం!

రేటింగ్ : 4/5Note: Please DO NOT use ABUSIVE language in comments.
2 Comments