• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

నిజానికి 'బాహుబలి ది కంక్లూజన్‌' సినిమా రేపు (ఏప్రిల్‌ 28) విడుదల కావాల్సి వుంది. కానీ, ఒక్క రోజు ముందుగానే ఈ సినిమా నేడే విడుదలవుతోంది. నిజ్జంగా నిజమిది. ఈ రోజు రాత్రి 9 గంటలకు తొలి షో పడనుంది. మామూలుగా అయితే ఇవి బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్‌ షోల పేరుతో రొటీన్‌గా జరిగే తంతులో భాగమే. ఏవో కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో ముందుగా విడుదలైతే, అదీ అర్థరాత్రి దాటాక విడుదలైతే, వాటిని ప్రీమియర్‌ షోలు లేదంటే బెనిఫిట్‌ షోలు అనుకోవచ్చు. 

కానీ, 'బాహుబలి' విషయంలో అలా కాదు. రాత్రి 9 గంటల నుంచే పెద్దయెత్తున స్క్రీనింగ్‌ కోసం సన్నాహాలు చేసేశారు. కనీ వినీ ఎరుగని రీతిలో ఈ షోల కోసం టిక్కెట్ల ధరల్ని పెంచేసి, అమ్మేశారు కూడా. అయితే, తెలంగాణలో ఈ సినిమా ముందస్తు ప్రదర్శనకు అనుమతి లేదని మరోమారు తేల్చి చెప్పేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. రేపట్నుంచి ఐదు షోలకు అనుమతి వుందనీ, టిక్కెట్ల ధరలు పెంచడం, ముందస్తు షోలు వేయడం వంటివాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతివ్వబోమని అంటున్నారాయన. నిన్ననే ఈ విషయమై క్లారిటీ ఇచ్చిన తలసాని, తాజాగా మరోమారు 'హెచ్చరికలు' జారీ చేసేయడం గమనార్హం. 

అయితే, 'బాహుబలి ది కంక్లూజన్‌'కి సంబంధించి ఇప్పటికే దాదాపుగా టిక్కెట్ల అమ్మకాలు పూర్తయిపోయాయి. అదీ పెంచిన రేట్లతో. కాబట్టి, ఇప్పుడు కొత్తగా మంత్రి చేసే హడావిడిలో అర్థమే లేదనే వాదన విన్పిస్తోంది. ఇంకోపక్క, తొలి వారం టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చన్న కోణంలో పెంపుని సమర్థించుకుంటున్నాయి థియేటర్ల యాజమాన్యాలు. 

ఇంతకీ, ఈ రోజు తొలి షో రాత్రి 9 గంటలకు పడుతుందా.? టిక్కెట్ల ధరల మాటేమిటి.? అన్న ప్రశ్నలకు కొద్ది గంటల్లోనే సమాధానం దొరికిపోనుంది. ఒక్కటి మాత్రం నిజం, తొలి వారం ఫ్లాట్‌ రేట్‌ పేరులో టిక్కెట్‌ ధరని 150 దాకి పెంచేయడం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. 'పెద్దల' మద్దతు లేకుండా అదంతా సాధ్యమయ్యిందనుకోలేం. 'బాహుబలి' విషయంలో ఇప్పుడు జరుగుతున్నదీ జస్ట్‌ పబ్లిసిటీ స్టంట్‌గానే భావించాలేమో.!



Note: Please DO NOT use ABUSIVE language in comments.