• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

దివంగత జయలలిత ప్రియసఖి శశికళ నటరాజన్‌ వరుసగా ఓటమిపాలవుతూ వస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి కావాలనుకున్న ఆమె ఆశలను సుప్రీం కోర్టు చిదిమేస్తే అన్నాడీఎంకే అధికారిక ఎన్నికల చిహ్నం 'రెండాకులు'పై ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకున్న ఆకాంక్షను ఎన్నికల సంఘం కాలరాసింది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎన్నికల చిహ్నం తమకే వస్తుందని శశికళ వర్గం నమ్మకంగా ఉంది. కాంగ్రెసు నాయకులు కమ్‌ మాజీ న్యాయశాఖమంత్రులైన వీరప్ప మొయిలీ, సల్మాన్‌ ఖుర్షీద్‌లతో ఎన్నికల కమిషన్‌ ముందు వాదనలు వినిపించింది. అయినప్పటికీ రెండాకులు దక్కలేదు. తమిళనాడులో ఎన్నికల గుర్తుపై వివాదం రేగడం ఇది రెండోసారి. గతంలో ఎంజీఆర్‌ మరణించాక పార్టీ జయలలిత, జానకి (ఎంజీఆర్‌ భార్య) వర్గాలుగా విడిపోయింది. అప్పుడు రెండాకుల కోసం కొట్టుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్‌ దాన్ని ఎవ్వరికీ ఇవ్వకుండా ఆ వర్గాలకు వేరువేరు గుర్తులు కేటాయించింది. ఇప్పుడూ అలా చేయొచ్చని కొందరు వేసుకున్న అంచనాలు నిజమయ్యాయి. ఇదిలా ఉండగా, జయలలిత మరణానికి శశికళే కారణమనే ఆరోపణల వెల్లువ ఇంకా తగ్గలేదు.

ఆమె బెంగళూరు జైల్లో ఉన్నప్పటికీ జయలలిత మరణానికి నువ్వే కారకురాలివి, నువ్వే ఆమెను చంపావు...అని నిందిస్తూ, శాపనార్థాలు పెడుతూ తమిళనాడు నుంచి జయ అభిమానులు అసంఖ్యాంగా ఉత్తరాలు రాస్తున్నారు. జయలలిత గుండెపోటుతో చనిపోయిందని పైకి చెప్పిన కారణమైనా అసలేం జరిగిందనేది ఇప్పటివరకు జనాలకు తెలియదు. దీంతో జయను స్నేహితురాలు శశికళే చంపిందనే వాదన ఇంకా సజీవంగానే ఉంది. శశికళ జైలుకు వెళ్లిన ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటివరకు ఆమెను శాపనార్థాలు పెడుతూ, నిందిస్తూ వందకు పైగా ఉత్తరాలు తమిళనాడు నుంచి పరప్పన అగ్రహారం జైలుకు వచ్చాయని సమాచారం. ''నువ్వు మా నాయకురాలిని, మేం ప్రేమించే అమ్మను చంపావు. నువ్వు ఆమెకు నమ్మకద్రోహం చేశావు. వెన్నుపోటు పొడిచావు. నువ్వు వంచకురాలివి. మోసగత్తెవు. ఆమె నీకు జీవితం ఇచ్చింది. ఆమెను చాలా పొందావు. గుర్తుపెట్టుకో...నవ్వు చేసిన పాపాల కారణంగానే బాధపడతావు. అడుగడుగునా కష్టాలు ఎదర్కొంటావు. నువ్వు పొందినదంతా తిరిగి చెల్లించాల్సివుంటుంది''...ఇది ఓ ఉత్తరంలోని సారాంశం.

ఇలాంటి ఉత్తరాలు దాదాపు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయని జైలు అధికారుల సమాచారం. అయితే శశికళకు హాని తలపెడతామనే సమాచారం ఏ ఉత్తరంలోనూ లేదంటున్నారు. శశికళకు వస్తున్న ఉత్తరాల్లో తిట్లు, శాపనార్థాలున్న ఉత్తరాలను తోటి ఖైదీ కమ్‌ శశికళ వదిన ఇళవరసి చింపేస్తోంది. మొదట్లో శశికళ ప్రతి ఉత్తరాన్ని చదివేది. కాని 'జయను నువ్వే చంపావు' టైపు ఉత్తరాలు ఎక్కువ కావడంతో చదవడం మానుకుంది. చెన్నయ్‌ కంటే సేలం, ధర్మపురి, మదురై, దిండిగల్‌, కరూర్‌, తిరుచిరాపల్లి, విల్లుపురం నుంచి ఎక్కువ ఉత్తరాలు వస్తున్నాయి. జయలలిత కన్నుమూసిన నెల రోజుల తరువాత కొంతకాలం క్రితం  ఆమెకు  వైద్యం చేసిన చెన్నయ్‌ అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నోరు విప్పారు. అప్పటివరకు ఆయన మీడియాతో మాట్లాడిన దాఖలాలు లేవు. కాని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జయలలితకు గుండెపోటు వస్తుందని ఊహించలేకపోయామని చెప్పారు. మధ్యలో రెండు రోజులు తప్ప తాను రెండు నెలలపాటు చెన్నయ్‌ వదిలి వెళ్లలేదని, జయకు జరిగిన అన్ని చికిత్సలను దగ్గరుండి పర్యవేక్షించానని చెప్పారు.

వైద్యానికి సంబంధించిన పలు విషయాలు వివరించారు. కాని ఆమెకు కలిగిన అనారోగ్యం ఏమిటి? ఏ జబ్బుకు చికిత్స చేశారు? ఆమె అనారోగ్యం వివరాలు ఎందుకు బయటకు చెప్పలేదు? ఆమె కోలుకుందని, ఇష్టమొచ్చినప్పుడు ఇంటికి వెళ్లవచ్చునని చెప్పాక కూడా ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు? ఆమెను చూడటానికి ప్రముఖులను కూడా ఎందుకు అనుమతించలేదు?....ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అపోలో ఛైర్మన్‌ జవాబులు చెప్పలేదు. జయలలిత మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని మద్రాసు హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురించాయి. ప్రతాప్‌ రెడ్డి కీలకమైన విషయాలు చెప్పకుండా గుండెపోటును ఊహించలేకపోయామంటూ అదేదో ఆశ్చర్యకరమైన విషయంలా చెప్పారు. జయ మరణం, ఆమెకు అందించిన చికిత్స వివరాలతో ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కేంద్రానికి నోట్‌ పంపారు. కాని ఇంకా మిస్టరీగానే ఉంది.Note: Please DO NOT use ABUSIVE language in comments.