• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

జయలలిత జీవించి ఉంటే అన్నాడీఎంకే పార్టీ పరిస్థితి ఇలా ఉండేదా.? ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ పోటీ చేయడంలేదు. ఆ పార్టీ స్థాయంలో మూడు కొత్త పార్టీలు వచ్చి చేరాయి. అందులో ఒకటి శశికళ పార్టీ, ఇంకోటి పన్నీర్‌ సెల్వం పార్టీ, మరొకటి జయలలిత మేనకోడలు దీప పార్టీ. ఈ మూడు పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

అసలు అన్నాడీఎంకే పార్టీ అంటే ఏంటి.? అదొక ప్రభంజనం. అది ఒకప్పుడు. జయలలిత మరణంతో కుక్కలు చింపిన విస్తరలా అన్నాడీఎంకే పార్టీని మార్చేయడంతో, ఆ పార్టీ ఎన్నికల గుర్తుని, పార్టీని కూడా ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్‌ 'లాక్‌' చేసేసింది. ఇది ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికలకే పరిమితమా.? ఆ తర్వాత కూడా పరిస్థితి ఇంతేనా.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. 'రెండాకులు' ఎవరికీ కాకుండా పోగా, శశికళ వర్గానికి 'టోపీ' ఎన్నికల గుర్తుగా లభించింది. పన్నీర్‌ సెల్వం 'విద్యుత్‌ స్తంభం'తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, దీప 'ఎంజీఆర్‌ అమ్మ పేరవై' పేరుతో కొత్త పార్టీని స్థాపించిన విషయం విదితమే. ఆ పార్టీ సైతం తమ అభ్యర్థిని నిలబెడ్తోంది ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో. అయితే దీప పార్టీని ప్రస్తుతానికి అంతా లైట్‌ తీసుకుంటున్నారు. 

మొత్తమ్మీద, జయలలిత పరువుని బజార్న పడేశారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలాక.. ఇంకా ఆమెకి పరువెక్కడ.? అనే ప్రశ్న పుట్టుకురావడం సహజమే. అయితే, రాజకీయంగా ఆమె ఓ సంచలనం. తమిళ రాజకీయాల్లో జయలలిత ఓ డైనమిక్‌ లీడర్‌. తాను జీవించి వున్న కాలంలో ఎప్పుడూ అన్నాడీఎంకే పార్టీకి ఇలాంటి దుస్థితి రాలేదు. ఇలాంటి పరిస్థితి పార్టీకి దాపురిస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు కలలో కూడా ఊహించి వుండరు. 

శశికళ, పన్నీర్‌ సెల్వం వర్గాలు విడివిడిగా ఆర్‌కె నగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఇంకొకరి గెలుపుకి కారణమైతే.. అదీ జయలలితకి అతి పెద్ద అవమానం. ఆ ముచ్చటా తప్పదేమో.!



Note: Please DO NOT use ABUSIVE language in comments.