• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

రివ్యూ: ఎస్‌ 3 (యముడు 3)
రేటింగ్‌: 2.75/5
బ్యానర్‌:
 స్టూడియో గ్రీన్‌, పెన్‌ మూవీస్‌
తారాగణం: సూర్య, అనుష్క, శృతిహాసన్‌, ఠాకూర్‌ అనూప్‌ సింగ్‌, సుమన్‌, రాధిక, శరత్‌బాబు, శరత్‌ సక్సేనా, సూరి, నీతు చంద్ర తదితరులు
పోరాటాలు: కనల్‌ కణ్ణన్‌
కూర్పు: వి.టి. విజయన్‌, టి.ఎస్‌. జయ్‌
సంగీతం: హారిస్‌ జయరాజ్‌
ఛాయాగ్రహణం: ప్రియన్‌
రిలీజ్‌: మాల్కాపురం శివకుమార్‌
నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్‌రాజా, దవళ్‌ జయంతిలాల్‌ గాడ
కథ, కథనం, దర్శకత్వం: హరి
విడుదల తేదీ: ఫిబ్రవరి 9, 2017

పోలీస్‌ క్యారెక్టర్‌తో ఒక ఆకట్టుకునే కథ అల్లడమే పెద్ద విషయం. ఆ క్యారెక్టర్‌ని ఫ్రాంచైజీగా మార్చి వరుసగా సినిమాలు తీయాలంటే సదరు దర్శకుడికి చాలా టాలెంట్‌ వుండాలి. 'దబంగ్‌'లో చుల్‌బుల్‌ పాండే క్యారెక్టర్‌తో రెండో సినిమా తీస్తే ప్రేక్షకులకి నచ్చలేదు. 'గబ్బర్‌సింగ్‌'కి 'సర్దార్‌' అంటూ ఎక్స్‌టెన్షన్‌ ఇస్తే అదీ తిరస్కరణకి గురయింది. 'సింగం' రీమేక్‌కి సీక్వెల్‌ని 'సింగం రిటర్న్స్‌' అంటూ రోహిత్‌ శెట్టి ట్రై చేసాడు కానీ ఆశించిన రిజల్ట్‌ రాలేదు. పోలీస్‌ క్యారెక్టర్‌ హీరో అంటేనే రొటీన్‌ ఎలిమెంట్స్‌ వుంటాయి. ఆ క్యారెక్టర్‌తో ఒక సినిమాకోసం పవర్‌ఫుల్‌ సీన్లు క్రియేట్‌ చేసి ఫాన్స్‌ని, మాస్‌ని మెప్పించవచ్చు కానీ కొనసాగింపులు తీయడంలో ఎంతో మంది ఫెయిలయ్యారు. 

కానీ తమిళ దర్శకుడు హరి మాత్రం 'సింగం' తర్వాత 'సింగం 2' తీసి సక్సెస్‌ అవ్వడమే కాకుండా 'ఎస్‌ 3' అంటూ మూడోసారి 'యముడు'గా సూర్యని మన ముందుకి తెచ్చాడు. సింగం సెకండ్‌ ఎడిషన్‌లోనే కథలేక హరి చాలా గిమ్మిక్కులకి పాల్పడ్డాడు. క్యారెక్టర్‌కి వున్న పాపులారిటీ వల్ల, అతని వేగవంతమైన స్క్రీన్‌ప్లే వల్ల అది పాస్‌ అయిపోయింది. మరి మూడోసారి అదే పాత్రతో ఇంకో సినిమా తలపెట్టినపుడు సెకండ్‌ టైమ్‌ చూపించిన అలసత్వం ప్రదర్శిస్తే చెల్లదు. ఇది సరిగ్గా గ్రహించిన హరి ఈసారి 'యముడు 2' కంటే బెటర్‌ ప్రోడక్టే అందించాడు. అయితే 'యముడు' అంత పవర్‌ఫుల్‌గా మాత్రం తీర్చిదిద్దలేకపోయాడు. 

మెడికల్‌ వేస్ట్‌ డంపింగ్‌ అంటూ ఆసక్తికరమైన పాయింట్‌నే ఈ చిత్రానికి నేపథ్యంగా ఎంచుకున్నాడు. రీసెంట్‌గా పత్రికల్లో ఈ విషయం గురించి పెద్ద దుమారమే జరిగింది కనుక న్యూస్‌ ఫాలో అయ్యేవాళ్లు హరి ఎంచుకున్న టాపిక్‌తో కనక్ట్‌ అవుతారు. 'యముడు' తీసినప్పుడు సింపుల్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌, హీరో-విలన్‌ క్లాష్‌ పెట్టుకుంటే సరిపోయింది కానీ, ఆ ఫ్రాంచైజీలో మూడో సినిమా అన్నప్పుడు విషయంలో వెయిట్‌ పెరగాలి. అందుకే హరి ఈ చిత్రంలో చాలా ఎలిమెంట్స్‌ని సపోర్ట్‌గా పెట్టుకున్నాడు. ఆషామాషీగా నాలుగు పంచ్‌ డైలాగులు చెప్పించి, కొన్ని మాస్‌ మసాలా సీన్లు దట్టించి ఫ్రాంచైజీ పాపులారిటీని క్యాష్‌ చేసుకోవాలని చూడలేదు. 

తెరపై అనుక్షణం ఏదో ఆసక్తికరమైన అంశం నడుస్తూనే వుంటుంది. అది కూడా వాయువేగంతో! దాంతో మనం చూస్తున్నది లాజికల్‌గా కరక్టేనా, కాదా? ఈ సీన్‌కి ఏమైనా అర్థముందా, లేదా? అనే ఆలోచనలు కూడా రావు. సీన్‌ తర్వాత సీన్‌కి స్ల్పిట్‌ సెకండ్‌ గ్యాప్‌ అయినా వుందా అని అనుమానం కలిగించేంత వేగంతో స్క్రీన్‌ప్లే పరుగులు పెడుతుంటుంది. ఫస్ట్‌ హాఫ్‌లో అయితే బొత్తిగా కథ లేకపోవడంతో వేగం తెలియడానికి కెమెరాని పట్టుకుని పరుగెత్తించారు. సెకండ్‌ హాఫ్‌లో మాత్రం సీన్లే పరుగులు పెడుతుంటాయి. హీరో, విలన్‌ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతూ మంచి మాస్‌ సీన్లకీ, హీరో ఎలివేషన్‌కి కావాల్సినంత స్కోప్‌ దొరుకుతుంది. 

కాకపోతే దీనంతటి మధ్యలో ఇతర కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కోసమని పెట్టిన కామెడీ, హీరోయిన్లతో సీన్లు ఏమాత్రం పండలేదు. అసలు ఎడిటింగ్‌లో ఇదంతా ఎందుకు తీసేయలేదనేంత చెత్త కామెడీ సీన్లు చాలానే ఫైనల్‌ కట్‌లోకి వచ్చేసాయి. హీరోయిన్ల పాత్రలే అనవసరం అనిపిస్తూ వుంటే, కమర్షియల్‌ అవసరం కోసం పెట్టుకున్న పాటలు పంటికింద రాళ్లలా తగులుతాయి. హారిస్‌ జైరాజ్‌ పూర్తిగా విఫలమయ్యాడు. 'సింహం సింహం హీ ఈజ్‌ నరసింహం' అంటూ దేవిశ్రీప్రసాద్‌ మార్కు థీమ్‌ మ్యూజిక్‌ లేకుండా నరసింహం కాస్త తేలిపోయాడు. మాస్‌ సినిమాకి అత్యవసరమైన ఒక్క జోష్‌ ఉన్న పాట కూడా స్కోర్‌ చేయని హారిస్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చెడగొట్టాడు. ఒక ఫ్రాంచైజీని ముందుకి తీసుకెళ్లాలన్నపుడు కీలకమైన టెక్నీషియన్‌ని మార్చేయడం కరక్ట్‌ కాదు. కనీసం ఈగోకి పోకుండా సింగం థీమ్‌ మ్యూజిక్‌ని అయినా హారిస్‌ కంటిన్యూ చేసి వుండాల్సింది. 

సూర్య మరోసారి 'నరసింహం' పాత్రలో గర్జించాడు. అతని పవర్‌ఫుల్‌ పర్‌ఫార్మెన్స్‌, టెర్రిఫిక్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఈ చిత్రానికి పెద్ద బలాలు. అనుష్కలో మునుపటి ఛార్మ్‌ లేదు. శృతిహాసన్‌ది కేవలం గ్లామర్‌ కోసం యాడ్‌ చేసిన కరివేపాకు పాత్ర కావడంతో ఆమె కూడా మెరవలేదు. విలన్‌గా చేసిన ఠాకూర్‌ ధృఢంగా వున్నాడు కానీ ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా వీక్‌ అయ్యాడు. రాధిక పాత్ర మరీ డ్రమెటిక్‌గా అనిపిస్తుంది. స్టంట్‌ డైరెక్టర్స్‌ అద్భుతమైన అవుట్‌పుట్‌ ఇచ్చారు. ఆ కంటెయినర్‌ ఛేజ్‌ ఫెంటాస్టిక్‌గా వచ్చింది. ఎడిటర్‌కి చేతినిండా పని దొరికింది. రెండు వందల సీన్లు తీసేసి మొత్తం రెండున్నర గంటల్లో పెట్టేసినా ఎక్కడా క్లారిటీ మిస్‌ కాలేదు. సినిమాటోగ్రాఫర్‌ పనితనం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు సినిమాకి రిచ్‌ లుక్‌నిచ్చాయి. 

హీరో ఎలివేషన్‌ అద్భుతంగా ఇవ్వడంతో పాటు సెకండ్‌ హాఫ్‌లో హీరో వర్సెస్‌ విలన్‌ సీన్స్‌ అన్నీ బ్రహ్మాండంగా తెరకెక్కించిన హరి ఈ చిత్రానికి ఎమోషనల్‌ టచ్‌ ఇవ్వడంలో విఫలమయ్యాడు. రాధిక పాత్రకి పే ఆఫ్‌ లేకుండా పోయింది. ఆ క్యారెక్టర్‌పై లాస్ట్‌ సీన్‌ చాలా పేలవంగా తయారైంది. అలాగే విలన్‌ని తన పోలీస్‌ స్టేషన్‌లో నిలబెట్టే సీన్‌, పోలీస్‌ స్టేషన్లో అడుగు పెట్టనన్న శరత్‌ సక్సేనాని అరెస్ట్‌ చేసే సీన్‌ కూడా ఎఫెక్టివ్‌గా రాలేదు. ఇలాంటి పే ఆఫ్‌ సీన్లు ఎంత బాగా పండితే అంతగా సినిమా రేంజ్‌ పెరుగుతుంది. సింగం సిరీస్‌ని ఇష్టపడేవారికి ఈ చిత్రంలో వారికి కావాల్సిన అంశాలన్నీ దొరుకుతాయి. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ హీరోయిజం ఇష్టపడే ఆడియన్స్‌కి బోలెడంత స్టఫ్‌ వుంది. మాస్‌ ప్రేక్షకులు కంప్లయింట్‌ చేయడానికంటూ ఏమీ లేదు కానీ ఇతర వర్గాలని ఆకట్టుకునే అంశాలు తక్కువ కావడం దీని బలహీనత. పాటలు, కామెడీ పరంగా కేర్‌ తీసుకుని వుంటే ఇంకాస్త రీచ్‌ పెరిగేది. 

బాటమ్‌ లైన్‌: ఎస్‌ 3ది 4జి స్పీడు!Note: Please DO NOT use ABUSIVE language in comments.