• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఎవరూ ఊహించని మలుపు ఇది. పన్నీరు సెల్వం అంటే, 'బాహుబలి' సినిమాలోని కట్టప్ప అనుకున్నారంతా. కానీ, కట్టప్పలా జయలలిత తర్వాత శశికళకు కొమ్ముకాయలేదు. ఎదురుతిరిగారు. అందుకుగల కారణాల్నీ ఆయన ఏకరువు పెట్టారు. తనకు ఎదురైన అవమానాల్ని వివరించారు. అసలు శశికళ ఎందుకు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారో చెప్పారు. ఇందులో నిజమెంత.? అనే విషయం పక్కన పెడితే, శశికళ తీరు మొదటినుంచీ అనుమానాస్పదమే. 

ఎలాగైతేనేం, పన్నీర్‌ సెల్వం - శశికళకు చెక్‌ పెట్టగలిగారు. ఈపాటికి ముఖ్యమంత్రి పీఠమెక్కాల్సిన శశికళ ఇంకా టెన్షన్‌తోనే వున్నారంటే అదంతా పన్నీర్‌సెల్వం ఎఫెక్టే. గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నయ్‌ వైపు కన్నెత్తి చూడటంలేదు. రాజీనామా లేఖ అందించేముందే, పన్నీర్ - గవర్నర్ మధ్య మంత్రాంగం నడిచిందన్నది ఓ గాసిప్. ఆ సంగతి అలా వుంటే, పన్నీర్‌ సెల్వం, శశికళ వర్గానికి గండికొట్టేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రస్తుతానికి పన్నీర్‌సెల్వం దగ్గర్ను ఎమ్మెల్యేల బలం కేవలం 4 మాత్రమే. అదే, శశికళ బలానికొస్తే.. ఏకంగా 130 మంది ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతిస్తున్నారు. 

అయినాసరే, పన్నీర్‌సెల్వంని చూసి శశికళ వణుకుతున్నారు. నిబంధనల్ని తుంగలోకి తొక్కి మరీ ముఖ్యమంత్రి అయిపోదామనుకున్నారామె. అసలు పార్టీ ప్రధానకార్యదర్శిగా శశికళ ఎంపికే అక్రమం, అన్యాయమంటూ కొత్త వాదన తెరపైకొచ్చింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌, శశికళకు పెద్ద షాకే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. శశికళ గనుక పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అనర్హురాలైతే, అనూహ్యంగా ఆమె బలాన్ని కోల్పోతారు. ఎమ్మెల్యేలంతా చేజారిపోతారు. అప్పుడిక పన్నీర్‌సెల్వం పవర్‌ఫుల్‌ అవుతారన్నది నిర్వివాదాంశం. 

'అసెంబ్లీని సమావేశపర్చండి.. నా బలం ఏంటో నిరూపించుకుంటా..' అని తాజాగా పన్నీర్‌ సెల్వం చెప్పారంటే, పూర్తిస్థాయి కాన్ఫిడెన్స్‌ ఆయనకి వుండే వుండాలి. కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో ఇంత ధైర్యంగా ఆయన ఆ మాట ఎలా అనగలిగారో శశికళకు సైతం అర్థం కావడంలేదిప్పుడు. తన బలం నిరూపించుకోవడం సంగతెలా వున్నా, శశికళను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న కసి పన్నీర్ సెల్వంలో కనిపిస్తోంది. మొత్తమ్మీద, పన్నీర్‌ సెల్వం పూటకో పంచ్‌ విసురుతోంటే, పూర్తిస్థాయి బలం తనుకున్నా.. శశికళ వణుకుతున్నారు.. అదీ పన్నీర్‌ సెల్వం పంచ్‌ పవర్‌ అంటే.!



Note: Please DO NOT use ABUSIVE language in comments.