• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఆంధ్రదేశంలో రైతును అన్నివిధాలా ఆదుకుని, వ్యవసాయం వదిలిపెట్టిన వారిని కూడా మళ్లీ వ్యవసాయం వైపు మళ్లించడమేముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం అని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన ఇంటర్వూ ఇవ్వడం ఇదే ప్రధమం. కన్నబాబు గ్రేట్ ఆంధ్రతో మాట్లాడుతూ వ్యవసాయ రంగం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధిని వివరించారు.

వ్యవసాయ శాఖకు మంత్రి అయ్యారు. హ్యాపీయేనా?
అందరి అభిమానంతో, మీడియా అయిదేళ్ల పాటు అందించిన సహకారంతో, భగవంతుడి కృపతో విజయం సాధించాను. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మరింత అభిమానం చూపించి, ఈశాఖకు మంత్రిని చేసారు. ఇప్పుడు దేశం అంతా మళ్లీ వ్యవసాయ రంగం వైపు చూస్తోంది. అలాంటి నేపథ్యంలో వ్యవసాయ మంత్రిని కావడం హ్యాపీనే కదా.

వ్యవసాయానికి సమస్యలు చాలా వున్నాయి. ఎలా అధిగమించాలని మీ ప్రణాళిక?
పెట్టుబడి, సకాలంలో ఎరువులు, విత్తనాలు, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు ఇవీ ప్రధాన సమస్యలు వీటి పరిష్కారం దిశగానే ఇప్పుడు ప్రణాళికలు రూపొందించమని ముఖ్యమంత్రి ఆదేశించారు. వాస్తవానికి పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహాయం వచ్చే ఏడాది నుంచి అని అనుకున్నాం. కానీ ఈ ఏడాది నుంచే చేయాలని, అక్టోబర్ నాటికి అందివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పైగా ఈసారి ప్రత్యేకత ఏమిటంటే కౌలు రైతులను గుర్తించి, వారికి కూడా సహాయం అందించడం. ఇప్పటికే కౌలు కార్డులు వున్నవారిని గుర్తించాం. వారికి కూడా సహాయం అందిస్తాం.

కానీ మన దగ్గర కౌలు అన్నది ఎక్కువగా చట్టబద్దం, అలాగే అగ్రిమెంట్ లు వుండడం అరుదు కదా?
ఆ సమస్య వుంది. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అన్నది కూడా ఆలోచిస్తున్నాం. వ్యవసాయ సీజన్ ప్రారంభం నాటికి విత్తనాలు ఎరువులు రెడీ చేస్తున్నాం. వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, కేవలం కాగితాల మీద అంకెలు కాకుండా, కిట్టింపు లెక్కలు కాకుండా వాస్తవంగా రైతులకు ప్రయోజనం వుండేలా చర్యలు చేపట్టాలన్నది మాకు ముఖ్యమంత్రి ఇచ్చిన లక్ష్యం.

సహకార రంగ చక్కెర ప్యాక్టరీల సంగతేమిటి? అవి దాదాపు కండెమ్డ్ స్టేజ్ కు వచ్చాయి కదా? ఎలా పునరిద్దరిస్తారు.
మూతపడిన సహకార చక్కెర మిల్లులను తెరిపిస్తామని జగన్మోహన రెడ్డి వాగ్దానం చేసారు. ఆ విధంగా వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేస్తూ, నివేదికలు తయారుచేసే పనికి త్వరలో శ్రీకారం చుట్టుబోతున్నాం.

వ్యవసాయ రంగానికి ఈసారి బడ్జెట్ లో ఏమేరకు నిధులు అందుబాటులోకి వస్తాయని అంచనా?
అది ఇప్పుడే చెప్పేదికాదు. పార్టీ మేనిఫెస్టో, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ప్రతిపాదనలు, ప్రణాళికల రూపకల్పన జరగాలి. ఆ మేరకు అప్పుడు కేటాయింపులు వుంటాయి. ఏమైనా ఈ ప్రభుత్వం వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తుందన్నది వాస్తవం.

మీది కాకినాడ రూరల్ నియోజక వర్గం. కాకినాడను ఏ విధంగా అభివృద్ది చేయబోతున్నారు?
ఫిషరీస్ యూనివర్సిటీ అన్నది ప్రతిపాదనలో వుంది. పట్టణ అభివృద్దికి ప్రణాళికలు ఎప్పటికప్పుడు వుంటూనే వుంటాయి. వాటికి నా వంతు సహకారం అనేది పక్కాగా వుంటుంది.

మీ నియోజక వర్గ ప్రజల్ని ఎప్పుడు కలుసుకోబోతున్నారు.
అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. వీలైతే ఈ వీకెండ్ లో ఒకటి రెండురోజులు వెళ్లి రావాలి. కార్యాలయం, పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో సిబ్బంది వుండేలా చూస్తాను. నియోజక వర్గ సమస్యలు, కార్యకర్తల విన్నపాలకు కూడా ప్రయారిటీ ఇస్తాను.Note: Please DO NOT use ABUSIVE language in comments.