• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

సమీక్ష: హిప్పీ
రేటింగ్‌: 1/5
బ్యానర్‌: వి క్రియేషన్స్‌
తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవంశి, జెడి చక్రవర్తి, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, జాజ్బా సింగ్‌ తదితరులు
మాటలు: టి.ఎన్‌. కృష్ణ, కాశిరాజు
కూర్పు: కె.ఎల్‌. ప్రవీణ్‌
సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న
ఛాయాగ్రహణం: ఆర్‌.డి. రాజశేఖర్‌
నిర్మాత: కలైపులి ఎస్‌. థాను
కథ, కథనం, దర్శకత్వం: టి.ఎన్‌. కృష్ణ
విడుదల తేదీ: జూన్‌ 6, 2019

'7' చేసిన గాయాలు ఇంకా పచ్చిగా వుండగానే మళ్లీ రింగ్‌లోకి దిగాల్సి వచ్చింది. 7లో అయినా అడపాదడపా తెరిపి లభించిందేమో కానీ హిప్పీలో మాత్రం నాన్‌స్టాప్‌గా బ్రూటల్‌ ఎటాక్‌. పైగా ఇందులో హీరో కిక్‌ బాక్సర్‌ కూడా!

విజయం ఎప్పుడూ ఆనందకరమే కానీ కొన్ని విజయాల వెంటే ప్రమాదాలు పొంచి వుంటాయి. ఆ విజయాన్ని ఆసరాగా తీసుకుని ఊహించని రీతిలో ముంచుకొస్తాయి. ఆర్‌ఎక్స్‌ 100 కంటే ముందు 'హిప్పీ' వస్తే దీనిపై ఎంతమందికి ఆసక్తి వుంటుంది? అఫ్‌కోర్స్‌... ఆర్‌ఎక్స్‌ 100 సక్సెస్‌కి బైప్రాడక్టే హిప్పీ అనేది కాదనలేం అనుకోండి.

హీరో యూత్‌కి నచ్చాడు, రిజిస్టర్‌ అయ్యాడు. కనుక వారికి నచ్చే అంశాలని పెట్టేస్తే పనైపోతుంది అనే ఆలోచనలలోంచి పుట్టిన సినిమానే హిప్పీ. బేసిగ్గా ఇందులో ఒక కథంటూ లేదు. కేవలం ఆడాళ్లు, మగాళ్లు చులాగ్గా బూతు సంభాషణలు చేసుకోవడం, మసాలా సరిపోనపుడు ఒక లిప్‌ లాక్‌ పడేయడం... ఇంకా అవసరం అనుకున్నపుడు కార్తికేయతో చొక్కా విప్పించడం!

ఆర్‌ఎక్స్‌ 100లో కార్తికేయ సిక్స్‌ ప్యాక్‌ బాడీ వుందనో, లిప్‌లాక్స్‌ వున్నాయనో జనం ఎగబడి చూడలేదు. అందులో బలమైన ప్లాట్‌ ట్విస్ట్‌ వుంది. అంతవరకు తెలుగు సినిమాలో చూపించని లక్షణాలతో కనిపించిన కథానాయిక పెద్ద షాక్‌ ఇచ్చింది. దాంతో ఆ చిత్రంలోని బలహీనతలు కూడా కవర్‌ అయిపోయి ఆ షాక్‌ వేల్యూతోనే సినిమా ఆడేసింది. అసలుది వదిలేసి మెరుగులని చూసి వీటివల్లే విజయం వరించింది అంటూ వాటితో సినిమా నడిపించేస్తే ఇలాగే హిప్పీలా బొక్కబోర్లా పడి 'బొప్పి' కడుతుంది.

ప్రేమించిన అమ్మాయిని (దిగంగన) ఎలాగయినా తన ప్రేమలోకి దించాలని ప్రయత్నించి, అందులో విజయం సాధించిన తర్వాత ఆ అమ్మాయి తన ఇష్టాలని కూడా స్వాహా చేస్తుంటే అందులోంచి బయటకి రావాలని కోరుకుని, తీరా దూరమైపోతుంటే ఆమె లేని లోటు ఫీలయి రియలైజ్‌ అయ్యే మోడ్రన్‌ దేవదాస్‌ (కార్తికేయ) కథ హిప్పీ. ముందే చెప్పినట్టుగా రెండున్నర గంటల పాటు నడిపించే కాంటెంట్‌ లేదు. కానీ అప్పుడే పెద్ద హిట్‌ కొట్టిన హీరో రెడ్‌ హాట్‌గా కనిపిస్తున్నాడు. సో... అతడి ప్రీవియస్‌ సినిమా సక్సెస్‌ని ఎలాగోలా క్యాష్‌ చేసేసుకోవాలని చూసారు. ఆర్‌ఎక్స్‌ 100లో శృంగారం పాళ్లు కాస్త ఎక్కువే అయినా ఆ కథకి అవి అవసరం. ఆ ప్లాట్‌ మొత్తం సదరు సన్నివేశాలపైనే ఆధారపడుతుంది.

హిప్పీలో అలా కాదు. అవసరం లేకుండా 'పచ్చిగా' మాట్లాడేస్తుంటారు. కారణం లేకుండా ముద్దులు, సందర్భం లేకుండా వయాగ్రా ప్లస్‌ 'ఎరెక్షన్‌' గురించిన ప్రస్తావనలతో యువతనుంచి ఎలాగైనా స్పందన రాబట్టుకోవడానికి విఫలయత్నం చేసారు. సెక్స్‌ సేల్‌ అవుతోందనే భ్రమలో ఆ మధ్య ఇలాగే 'బాబు బాగా బిజీ' అంటూ ఓ సినిమా తీసారు. అలాంటి చీప్‌ ట్రిక్స్‌ ఇక్కడ సేల్‌ అవ్వవనేది తెలుసుకుని అయినా ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానేసి వుండాల్సింది.

కార్తికేయకి సిక్స్‌ ప్యాక్‌ బాడీ వుంది. వెరీ గుడ్‌. అయితే ఏంటి? అతనికి నటనలో వున్న బలహీనతలని కప్పి పుచ్చడానికి అన్నిసార్లు చొక్కా విప్పించారా లేక అతను చొక్కా విప్పితే చూసేందుకు లేడీస్‌ వస్తారని బలంగా నమ్మేసారా? హీరో ఇందులో కిక్‌ బాక్సర్‌గా పరిచయం అవుతాడు. పోనీ ఆ అంశం చుట్టూ కథ ఏమైనా అల్లుకున్నారా అంటే అదేమీ లేదు. హీరోని 'హిప్పీ' హెయిర్‌ స్టయిల్‌తో పరిచయం చేసేటపుడు అతను చొక్కా వేసుకోకూడదు అనుకున్నారు. అందుకోసం అతడిని కిక్‌ బాక్సర్‌గా పరిచయం చేసారు.

ప్రేమించిన అమ్మాయి తన ఇష్టాలకి అడ్డు పడుతుందనేది అతని మేజర్‌ కంప్లయింట్‌. అలాంటప్పుడు అతని కిక్‌ బాక్సింగ్‌ కెరీర్‌కే ఆమె అడ్డు పడిందని చూపించవచ్చు. దాని వల్ల తన ఉనికిని కోల్పోయి అతను మధన పడుతున్నాడని చెప్పవచ్చు. రొటీన్‌ అంశమే అయినా కనీసం ఒక యాస్పెక్ట్‌ పెట్టాలని అనుకున్నపుడు దానికి అంతో ఇంతో సార్ధకత వుండేది. అలాంటి అర్థవంతమైనవి ఆలోచించకుండా... సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి రౌడీ షీటర్లతో తగవు అట. వారికి ఆపద వచ్చినపుడు హీరో కిక్‌ బాక్సింగ్‌ చేసి కాపాడతాడట. పైగా అతను చొక్కా విప్పగానే ఆ కంపెనీలో ఆడాళ్లంతా వావ్‌ అంటూ లొట్టలేయడం కూడానట!

సినిమా మొదలైన దగ్గర్నుంచీ హీరోయిన్‌పై కంప్లయింట్‌ చేయడమే హీరో పని. అతను ఎలా లవ్‌లో పడ్డాడు, ఆమె అతని ప్రేమలో ఎలా పడిందీ కూడా ఏమాత్రం ఆకట్టుకోదు. వేరే అమ్మాయి పెదాలపై ముద్దు పెడుతూ హీరోయిన్‌ని చూసి హీరోకి లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌. ఆమె అతడిని ఎప్పుడు ప్రేమించిందంటే... అతడు ఆమెకి ముద్దు పెడుతున్నపుడేనట! మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనుకోవాలన్నమాట. ఇలాంటి తలకు మాసిన సన్నివేశాలు చేస్తున్నపుడు, సంభాషణలు చెబుతున్నపుడు అయినా 'ఇదేంటిది?' అనే ప్రశ్న కూడా తలెత్తదా? తన స్నేహితురాలని ముద్దు పెట్టుకుంటున్నపుడే అతడిని లవ్‌ చేసినా కానీ వాళ్లిద్దరూ విడిపోయి, ఆమె తనంతట తానుగా అతడిని ప్రేమించుకో అనేవరకు ప్రేమించలేదట. 'నా ఎథిక్స్‌ అలాంటివి' అంటుంది ఏదో పెద్ద అపర సాధ్విలా!

కార్తికేయ ఫేస్‌ కంటే సిక్స్‌ ప్యాక్‌ ఎక్కువ నటించాల్సి వచ్చింది. దిగంగన మొదటి సినిమా అయినా నటన పరంగా ఫర్వాలేదనిపించింది. జెడి చక్రవర్తితో రామ్‌గోపాల్‌వర్మ ఫిలాసఫీలు మాట్లాడించారు. అతను చేసేంత ప్రత్యేకత, ప్రాధాన్యత వున్న పాత్ర అయితే ఖచ్చితంగా కాదు. వెన్నెల కిషోర్‌ అంతసేపు కనిపించినా అస్సలు నవ్వించలేకపోయిన సినిమా ఇదే కావచ్చు. సాహిత్యం లేకుండా కొన్ని బాణీలు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చినపుడు బాగున్నాయనిపించాయి.

ఈ సినిమా కంటూ ఆకర్షణ ఏదయినా వుంటే అది ఛాయాగ్రహణం ఒక్కటే. దర్శకుడు హీరో గత చిత్రం తాలూకు ఇంపాక్ట్‌ని నమ్ముకోకుండా ఏదయినా పకడ్బందీ కథ రాసుకుని వుంటే అతని టాలెంట్‌ గురించి మాట్లాడుకునే వీలుండేది. ముందే చెప్పినట్టుగా ఆర్‌ఎక్స్‌ 100 వల్ల కార్తికేయకి జరిగిన యాక్సిడెంట్‌ ఇది. ఇప్పటికైనా సోకాల్డ్‌ బూతులు యూత్‌ని ఆకట్టుకోవని గ్రహిస్తే ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి అవకాశముంటుంది.

బాటమ్‌ లైన్‌: పిప్పి!Note: Please DO NOT use ABUSIVE language in comments.