- Post by Admin on 7/25/2018 9:57:01 PM
- 5 comments

పవన్ కల్యాణ్ పై ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఈరోజు జనసేన టీమ్ కౌంటర్ ఇచ్చింది. జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించారు. జగన్ వ్యాఖ్యలు హుందాగా లేవని, రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం గురించి కానీ, కుటుంబం గురించి కానీ మాట్లాడ్డం మంచి పద్ధతి కాదనీ ఆయన అన్నారు.
అయితే ఈ ప్రెస్ మీట్ కి ముందు జనసేనలో చాలా తర్జనభర్జనలు జరిగాయి. జగన్ వ్యాఖ్యలు సంచలనంగా మారిన నేపథ్యంలో పవన్ వ్యక్తిగతంగానే స్పందిస్తే బాగుంటుందని ఆయనకు పార్టీ నేతలు, సన్నిహితులు సూచించారట. ఈరోజు జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా మీడియా, జగన్ వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించినా కూడా పవన్ తర్వాత మాట్లాడతానని చెప్పి ఆ అంశాన్ని దాటవేశారు.
సాయంత్రం పవన్ ప్రెస్ మీట్ ఉంటుందని, జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశముందని, తనపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలకు ఆయన నేరుగా బదులు చెబుతారని మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది. అయితే పవన్ కల్యాణ్ ఎందుకో వెనక్కితగ్గారు. తన టీమ్ తో ప్రెస్ మీట్ పెట్టించి సరిపెట్టారు.
గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు పవన్ నేరుగానే స్పందించారు. వ్యక్తిగత విషయాల జోలికొస్తే.. తాను కూడా చాలానే మాట్లాడతానని ధీటుగా బదులిచ్చారు. అయితే ఈసారి ఎందుకో జగన్ విషయంలో మాత్రం ఆయన వెనక్కితగ్గారు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఫిలింఛాంబర్ కి వెళ్లి తెగ హంగామా చేసిన పవన్, జగన్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
ఇది వ్యూహాత్మక మౌనమా లేక మరో సందర్భంలో నేరుగా పవన్ స్పందిస్తారా అనేది చూడాలి.
