• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కారణంగా ఏపీకి అన్యాయం జరిగిందనేది వాస్తవం. యూపీఏ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చిన ప్రత్యేకహోదా అమలు కాకపోవడానికి కేవలం ప్రధాని లేదా కేంద్ర ప్రభుత్వమే కారణం కాదు. ఇప్పటి ఉప రాష్ట్రపతి, ఆనాటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా కారణమే. ప్రత్యేక హోదాపై బాబు సహా అందరూ యూటర్న్‌ తీసుకున్నారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం కావాలంటూ పోరాటం చేస్తున్నారనడం వాస్తవం.

టీడీపీ ఎంపీలు రాజ్యసభలో హోదా కోసం నినదిస్తున్నారు. రాజ్యసభకు వెంకయ్య నాయుడే ఛైర్మన్‌ కావడంతో విభజన సమయంలో సంగతులన్నీ మీకు తెలుసుకదా. అప్పుడు ఏం హామీలు ఇచ్చారో మీకు అవగాహన ఉంది కదా అంటూ టీడీపీ ఎంపీలు పదేపదే అనడం వెంకయ్యకు అసహనంగా ఉంది. టీడీపీ ఎంపీలు ఎప్పుడూ చేసే విమర్శలే చేశారు. నాలుగేళ్లుగా విభజన హామీలు నెరవేర్చడంలేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా తానిచ్చిన హామీని అమలు చేసి తీరాల్సిందేనన్నారు.

ప్రభుత్వం తరపున యథాతథంగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తన వాదన వినిపించారు. టీడీపీ ఎంపీలు వెంకయ్య నాయుడి ప్రస్తావన పదేపదే తీసుకురావడంతో 'నాకన్నీ తెలుసు. ఆ రోజు సభలో ఏం జరిగిందో తెలుసు. ఎవరికి అన్యాయం జరిగిందో తెలుసు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితిలో ఏమీ మట్లాడలేను. రాజ్యసభ ఛైర్మన్‌గా నా అభిప్రాయాలు చెప్పలేను' అన్నారు. దీన్నిబట్టి చూస్తే కేంద్రం తీరుపై ఆయనకు అసంతృప్తిగా ఉందనిపిస్తోంది.

గతంలో మంత్రిగా ఉన్నప్పుడు మంత్రులతో మాట్లాడి సాధ్యమైనంతవరకు స్వరాష్ట్రానికి నిధులు ఇప్పించడం, అవసరమైన అనుమతులు ఇప్పించడం, కేంద్రానికి-రాష్ట్రానికి సంధానకర్తగా వ్యవహరించడం... ఇలా ఏదోవిధంగా కృషి చేశారు. కేంద్రంలో వెంకయ్య ఉన్నాడనే ధైర్యం బాబు ప్రభుత్వానికి ఉండేది. కాని వెంకయ్య ఉప రాష్ట్రపతి అవడంతోనే పరిస్థితి తారుమారైంది. ఆయనను ఆ పదవి వరించినప్పుడు ఆయనతోపాటు ఎవ్వరూ సంతోషంగా లేరని చెప్పొచ్చు.

ఈ పదవి తనకు భార్య లేని జీవితంలా ఉందని ఓ సందర్భంలో అన్నారు. ప్రజలను కలుసుకోలేని నేతగా మిగిలిపోయానన్నారు. 'వేదికపైకి రావాలి. రాసిచ్చిన నాలుగు మాటలు మాట్లాడి, నమస్తే చెప్పిపోవాలి. ప్రజలను కలవకుండా, మాట్లాడకుండా ఈ జీవితంలో ఇంకేముంది? ఏం చేయాలో తెలియడంలేదు. ఈ జీవితానికి అలవాటుపడేందుకు ప్రయత్నిస్తున్నా' అన్నారు. ఉప రాష్ట్రపతి పదవికి బీజేపీ ప్రతిపాదించగానే వద్దు మొర్రో అని మొత్తుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కలిసి కట్టబెట్టారు. బీజేపీ నాయకుడిగా, కేంద్రమంత్రిగా, రాజకీయాల్లో సీనియర్‌గా, వ్యూహకర్తగా, ట్రుబుల్‌ షూటర్‌గా (సమస్యల పరిష్కర్త), మూడు భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ) అనర్గళంగానే కాదు, చమత్కారంగా మాట్లాడే వక్తగా... ఇన్ని విధాల వెంకయ్య దేశవ్యాప్తంగా పాపులర్‌. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్య ఎంపికలో 'కుట్ర' ఉందనే అభిప్రాయం అప్పట్లో చాలామందిలో వ్యక్తమైంది.

వెంకయ్య ఎంపికకు మోదీ ఇచ్చిన వివరణ సరైంది కాదని రాజకీయ విశ్లేషకులన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరాటాన్ని నిస్సహాయంగా చూడటం తప్ప వెంకయ్యకు మరో మార్గం లేదు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.