• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

భారతీయ జనతా పార్టీతో పొత్తు తెంచుకోవడం మాత్రమే కాదు.... కాంగ్రెస్ తో పొత్తు కలుపుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని చాలారోజుల నుంచి రాజకీయ వర్గాల్లో పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి. కర్నాటక ప్రభుత్వ ఏర్పాటు సమయంలో రాహుల్ తో ముసిముసి నవ్వుల సంభాషణల దగ్గరినుంచీ... కాంగ్రెస్ తో జట్టు కట్టడానికి లేదా, ఎన్నికల తర్వాతనైనా వారికి మద్దతివ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉంటారనే సంకేతాలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవలి కాలంలో పార్లమెంటులో తెలుగుదేశం పార్లమెంటులో పోరాడాల్సిన తీరును కూడా గైడ్ చేస్తున్న ఉండవిల్లి అరుణ్ కుమార్ తాజాగా చెబుతున్న మాటలు గమనిస్తే.. పచ్చ కాంగ్రెస్ పొత్తులు పొడిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అరుణ్ కుమార్ తాజాగా ఢిల్లీలో మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కుతుందనే నమ్మకం కలుగుతున్నట్లు చెప్పడం విశేషం. కాంగ్రెస్ పార్టీ ఏపీలో లేచి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో.. ఉండవిల్లి మాటలు ప్రజలను నమ్మించడానికి వారికి ఎంతగానో ఉపకరిస్తాయని పలువురు విశ్లేషిస్తున్నారు.

ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేను అంటూనే... ఉండవిల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లో మహా క్రియాశీలంగా కనిపిస్తూ ఉంటారు. ఒకదశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దన్నుగా చక్రం తిప్పడానికి ప్రయత్నించిన ఉండవిల్లి అరుణ్ కుమార్... జెఎఫ్‌సి పేరుతో పవన్ కల్యాణ్ ఓ ప్రహసనం నడిపించిన సందర్భంలో ఆయనకు బాసటగా నిలిచారు. అలాగే... ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు మొదలు కావడానికి ముందు... తెలుగుదేశం పార్టీ సభలో ఎలా వ్యవహరించాలో... దిశానిర్దేశం చేశారు. తాజాగా ఆయన తిరిగి కాంగ్రెస్ కు రాష్ట్రంలో ప్రాణప్రతిష్ట చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హోదా వస్తుందనే నమ్మకం కలుగుతోందని... నష్టపోతాం అని తెలిసినా.. మాట మీద నిలబడే అలవాటు కాంగ్రెస్ కు ఉందని ఉండవిల్లి కితాబివ్వడం, అందుకు నిదర్శనంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పేర్కొనడం చిత్రమే. తెలుగుదేశం కొత్తగా హోదా పాట పాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో... కాంగ్రెస్ ద్వారా తప్పక హోదా వస్తుందనే ఈ మాటలు... ఆ రెండు పార్టీల భవిష్యత్ మైత్రీబంధానికి తార్కాణమా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.