• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

నిన్న మొన్నటిదాకా దేశంలో ఏ రాష్ట్రమూ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాని వ్యతిరేకించలేదు. కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తే ఊరుకునేది లేదని తెగేసి చెబుతోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వడమంటూ జరిగితే, తెలంగాణకు తీవ్ర నష్టం వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకీ ప్రత్యేకహోదా ఇస్తే మాత్రం ఇబ్బంది లేదని గులాబీ పార్టీ చెబుతుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

ప్రస్తుతానికైతే ప్రత్యేకహోదా ఓ 'మిధ్య'. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ససేమిరా అంటోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 'బొచ్చె'గా అప్పటి మన్మోహన్‌ సర్కార్‌ ప్రకటించింది ఆ ప్రత్యేక హోదానే. రాజధాని లేని రాష్ట్రం.. లోటు బడ్జెట్‌తో ఏర్పడ్డ రాష్ట్రం.. ఒక్కమాటలో చెప్పాలంటే, 13జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి అత్యంత దయనీయం.. విభజన జరిగిన సమయానికి.

'ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి మాకు అర్థమయ్యింది. అందుకే రాజధాని నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రం తరఫున సాయం చేయాలనుకున్నాం..' అంటూ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్ళొచ్చాక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పెద్ద మనసుతో చాలాగొప్పగా మాట్లాడేశారు. అంతేనా, తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎంపీలు పలు సందర్భాల్లో పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని అన్నారు.

కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి వాయిస్‌ మారింది. అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ రాష్ట్రమంటూ గొప్పగా చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే, ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి ఆమడదూరంలో వుందనీ, అది అరవయ్యేళ్ళ ఆంధ్ర పాలకుల పాపమంటూ కొత్తపల్లవి అందుకున్నారు. ఎలా.? ఇంతలోనే ఇంత మార్పు ఎలా సాధ్యమయ్యింది.? అంటే, ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సింపుల్‌.. ఆ సమాధానం, నరేంద్రమోడీ డైరెక్షన్‌లో కేసీఆర్‌ కొత్త పంథాలో ఆంధ్రప్రదేశ్‌కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని.

నిజానికి, కేంద్రంలో బీజేపీకీ, కాంగ్రెస్‌కీ వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ అనుకున్నారు. పలు సందర్భాల్లో కేంద్రంపై నిప్పులు చెరిగేశారు. కానీ, నరేంద్రమోడీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానంతో టీఆర్‌ఎస్‌ వాయిస్‌ మారిపోయింది. కేసీఆర్‌ రాజకీయ వ్యూహం ఎవరి అంచనాలకు అందని రీతిలో కొత్త పుంతలు తొక్కుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలనుకున్న వ్యక్తి, అవిశ్వాసం సందర్బంగా మోడీకి వ్యతిరేకంగా తమ పార్టీ ఎంపీలతో ఓటేయించాలి కదా.!

ఏమో, ఏం జరిగిందో.. నరేంద్రమోడీ ఏం మంత్రమేశారో.. కేసీఆర్‌ ఒక్కసారిగా 'యూటర్న్‌' తీసేసుకున్నారు. 'ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయాయ్‌.. ఇప్పుడేం చేయలేం..' అని చెప్పిన కేసీఆర్‌, తమ ఎంపీలతో ఆ ఏడు మండలాల్ని తిరిగి తెప్పించాల్సిందేనని పార్లమెంటులో చెప్పించడం, టీఆర్‌ఎస్‌ నేతలందరితో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తే ఊరుకునేది లేదని చెప్పిస్తుండడం.. ఇవన్నీ మోడీ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయనే భావన అయితే కలుగజేస్తున్నాయి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.