• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ప్రస్తుతానికి ఉన్న జీవిత లక్ష్యం రాహుల్ ను ప్రధానిని చేయడం మాత్రమే. అందుకోసం ఏం చేయడానికైనా ఆ పార్టీ శ్రేణులు తెగించి పనిచేసేలా కనిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఏకపక్షంగా ఎన్నికల బరిలోకి దిగి... కనీసం సింగిల్ లార్జెస్ట్ హోదాలో అయినా.. ఎంపీ సీట్లను దక్కించుకుని.. అధికారం ఆశించగల స్థాయి తమ పార్టీకి, ప్రధాని కాగల హక్కు తమ రాహుల్ కు ఉన్నదని ... చెప్పుకోగల ధైర్యం వారికిలేదు.

అందుకే ఎన్నికలు ఇంకా ఆమడ దూరంలో ఉండగనే... మతతత్వ భాజపాను ఓడించడానికి పొత్తులు అవశ్యం అంటూ... రాష్ట్రాల్లో ఉన్న బలమైన పార్టీలు అన్నిటినీ కలుపుకుపోయి అధికారంలోకి రావాలని వారు ఉత్సాహపడుతున్నారు. అలా అనివార్యమైన పొత్తులకోసం చేస్తున్న ప్రయత్నాలే.. కాంగ్రెస్ పార్టీకి గోతిని తవ్వేసేలా కనిపిస్తున్నాయి. చిన్న పార్టీలు, పెద్ద డిమాండ్లు పెడుతుండడం.. కేంద్రంలో అధికారం సంగతి ఎలా పోయినా.. తమవంతుగా రాష్ట్రాల్లో అధికారాన్ని తాము దక్కించుకుంటే చాలునని అనుకుంటుండడమే ఇలాంటి పరిస్థితికి దారితీస్తోంది.

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సమానంగా బలం కలిగి ఉండడం అనే పరిస్థితి మారిపోయింది. సింగిల్ లార్జెస్ట్ స్థాయిబలం ఉన్నాసరే... భాజపాను గద్దె ఎక్కనివ్వకుండా... అడ్డుకోవడంలో దేవేగౌడతో జట్టుకట్టడం ద్వారా కాంగ్రెస్ కర్నాటకలో పైచేయి సాధించింది. అదే సూత్రాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. సరిగ్గా అదే పాయింట్ ను ప్రాంతీయ పార్టీలు కూడా వాడుకోవాలని చూస్తున్నాయి.

కర్నాటక ఫార్ములా తరహాలోనే... తమకు ఉండే బలం అతి తక్కువ అయినా సరే... కాంగ్రెస్ ను ఆసరాగా వాడుకుని... రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని అనేక పార్టీలు ఉబలాటపడుతున్నాయి. రాష్ట్రాలకు మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... కాంగ్రెస్ పొత్తుల సంగతిని ఒక కొలిక్కి తీసుకురావడం వారికి చాలా అవసరంగా కనిపిస్తోంది. అయితే ఇతర పార్టీలు మాత్రం గట్టి డిమాండ్లే వినిపిస్తున్నాయి..

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో తమకు గౌరవ ప్రదమైన సంఖ్యలో స్థానాలు కేటాయించేట్లయితేనే.. కాంగ్రెస్ తో పొత్తుల గురించి ఆలోచిస్తాం అంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటికే తేల్చిచెప్పారు. ఎస్పీ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోంది. మరోవైపు తమకు బలం ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను తోసిరాజని, బలం లేనిచోట్ల మాత్రం కాంగ్రెస్ తో జట్టు కట్టాలని సీపీఎం అనుకుంటోంది.

పరిస్థితి ఎలా ఉన్నదంటే... చిన్న పార్టీలను వాడుకుని రాహుల్ ను ప్రధానిని చేసేయాలనేది కాంగ్రెస్ కల. అదే సమయంలో, కాంగ్రెస్ ను వాడుకుని రాష్ట్రాల్లో తాము పాగా వేయాలనేది చిన్న పార్టీల వ్యూహం. ఒక రాష్ట్రంలో ఒకటికంటె ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ కు సంకటాలు తప్పకపోవచ్చు. వారి డిమాండ్లకు, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాబల్యం పూర్తిగా అంతరించిపోవచ్చు. అలాగని ఈ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో గరిష్టమైన సీట్లు కాంగ్రెస్ కే ఇచ్చి సహకరిస్తాయో.. కూటమిలో ఉంటాము కదాని కొత్త డ్రామా చేస్తాయో తెలియదు.

ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ను ప్రధాని చేయడం కోసం వారి డిమాండ్లన్నీ ఒప్పుకుంటే... అది ఆత్మహత్యా సదృశమే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.