• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మొన్నటి వరకూ పవన్ కల్యాణ్‌కు స్థిమితం లేదు, మెచ్యూరిటీ లేదు, అవగాహన లేదు, పవన్ కల్యాణ్ కు వ్యక్తిత్వంలేదు... అంటూ మాట్లాడిన తెలుగుదేశం నేతలు హఠాత్తుగా మాటలు మార్చేస్తున్నారు. పవన్ కల్యాణ్ మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. పవన్ విషయంలో జగన్ అలా మాట్లాడాల్సింది కాదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ నొక్కులు అన్నీ వ్యూహాత్మకం అని ఎవరికీ తెలియనిది కాదు.

పవన్ కల్యాణ్ ను ఏమైనా అంటే తామే అనాలి అన్నట్టుగా, ఎవరైనా ఏమైనా అంటే దాన్ని తామే క్యాష్ చేసుకోవాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు. మొన్నటివరకూ చంద్రబాబు కేబినెట్ లోని మంత్రులందరూ పవన్ కల్యాణ్‌ను నానారకాలుగా విమర్శించారు. ఎప్పుడైతే పవన్ తమకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి వీరు విరుచుకుపడటం ప్రారంభించారు.

అంతకన్నా ముందే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ పై పరోక్షంగా సెటైర్లు వేశాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటారు.. విలువలు ఉండవు.. అంటూ అమెరికన్లను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కల్యాణ్ కు కూడా తగులుతాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నిసార్లు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది అమెరికన్లకే దోషం అయితే, భారతీయులకు కాదా? అప్పటికి పవన్ కల్యాణ్ చంద్రబాబుకు సన్నిహితుడే. అయినా బాబు అలా అన్నాడు. అప్పట్లో జనసేన వర్గాలు ఇలా రెచ్చిపోలేదు.

చంద్రబాబు పవన్ కల్యాణ్ ను అంటే వాళ్లకు అది హ్యాపీనేనేమో! జగన్ అనేసరికి మాత్రం ఈ వర్గాలు భగ్గుమంటున్నాయి. బహుశా టీడీపీతో తిట్టించుకొంటే సమ్మగా ఉంటుందేమో! ఇప్పుడు సన్నాయి నొక్కులతో టీడీపీ మరింత పెట్రోల్ పోస్తోంది. ఇదే అదునులో మళ్లీ జనసేన, టీడీపీలు భాయీభాయీ అయ్యేలా కూడా ఉన్నాయి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.