• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

‘‘దమ్ముంటే తెదేపా, వైకాపా పార్టీలు కేంద్రంలోని అవిశ్వాసం పెట్టాలి. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం ఒత్తిడితేవాలి’’ ఇది పవన్ కల్యాణ్ గతంలో చెప్పినమాట. జెఎఫ్‌సి అంటూ ఒక పెద్ద పేరుపెట్టి.. స్టార్ హోటళ్లలో ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు మేధావులతో చాలారోజుల పాటూ కసరత్తు చేయించి.. రాష్ట్రానికి మంచి జరగాలంటే ఏం చేయాలి? అనే విషయంలో ఇప్పటిదాకా పవన్ కనుగొన్న ఏకైక విషయం అదే. అవిశ్వాస తీర్మానం పెడితేచాలు.. కేంద్రం వణుకుతుంది. దిగివస్తుంది అని పవన్ అన్నారు. తెదేపా, వైకాపాలు భయపడుతున్నాయన్నారు.

కానీ, ఆయన సవాల్ ను తొలుత జగన్ స్వీకరించినప్పుడు, ఆ పరిణామం పవన్ కు మింగుడు పడలేదు. ఆ సమయానికి .. తాను అవసరమైన 50మంది సభ్యుల మద్దతు స్వయంగా కూడగడతానని సెలవిచ్చారు గానీ.. ఊరకుండిపోయారు. అప్పట్లో తీర్మానంపై చర్చ కూడా జరగలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది.. పవన్ తీరుమాత్రం మారలేదు. ఏదో ఆరోజు ఆవేశంలో అనేశాడే తప్ప.. అవిశ్వాసం గురించి గానీ, అది సాధించగల ఫలితాల గురించి గానీ, దాని అవసరం గురించి గానీ పవన్ కల్యాణ్ కు అసలు అవగాహన ఉన్నదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఎందుకంటే.. ఆయన ఇప్పుడు అవిశ్వాసం మీద చర్చ జరగబోతున్న కీలక తరుణంలో చాలా దారుణమైన మౌనం పాటిస్తున్నారు. నిజానికి ఆయన మౌనం అనేది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, జనసేన పార్టీకి కూడా చాలా నష్టదాయకం అని పలువురు భావిస్తున్నారు. ఇప్పుడు మౌనంగా ఉంటే ఏం పోతుందిలే.. ఆ తర్వాత కాస్త హడావిడి చేస్తే ఏదో నాలుగు మాటలు చెప్పేస్తే .... తనను జనం నమ్మేసి ఓట్లు కురిపించేస్తారు అని పవన్ అనుకుంటే పొరబాటు అనే అభిప్రాయం పార్టీలో కూడా వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే పవన్ కల్యాణ్ భాజపా స్క్రిప్టు మేరకు పనిచేస్తున్నట్లు ప్రజలు నమ్మేలా చేయడంలో చంద్రబాబు చాలాముందుకు వెళ్లిపోయారు. ఇప్పుడు అవిశ్వాసం గురించి కూడా పవన్ నోరెత్తకుండా మౌనం పాటిస్తే.. నష్టం ఆయనకే జరుగుతుందనే అభిప్రాయాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.