• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

మీడియా ప్రచారం దన్నుగా లేకుండా ఎదిగిన రాజకీయ నాయకులు మనకు కనిపించరు. తమకు వ్యతిరేక వార్తలు రాసే వారిని కూడా నెత్తిన పెట్టుకుంటూ.. వారితో వీలైనంత మంచిగానే ఉంటూ.. వారిపట్ల ప్రత్యేకశ్రద్ధను కనబరుస్తూ ఉండడం అనేది సాధారణంగా రాజకీయ నాయకుల అలవాటు.

అయితే జనసేన రాజకీయ పార్టీ.. మీడియా మీదనే ఆంక్షలు విధిస్తోంది. మీడియానుంచి వచ్చే ప్రతినిధులను పరిమితంగా మాత్రమే.. జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లు ఇతర కార్యక్రమాలకు అనుమతించేలా సన్నాహాలు చేస్తోంది.

నిజంగానే వారు చెబుతున్నట్లుగా స్థలాభావం వల్ల ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో లేదా... మీడియా కెమెరాలు అన్నిటినీ లోపలకు అనుమతిస్తే.. తమ ప్రమేయం లేకుండా.. తమకు ఇష్టం ఉండని ఫోటోలు, వీడియోలు తీసేస్తారని భయపడుతున్నారో గానీ.. మొత్తానికి కెమెరాలతో లోనికి రావద్దన్నట్లుగా అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు.

ఇవాళ ఏపీ నుంచి మత్స్యకారులు వచ్చి పవన్ కల్యాణ్ తో బేటీ అయ్యారు. తమను ఎస్టీల్లో చేర్చేలా చూడాలని వారు కోరారు. వారి డిమాండ్ పై పవన్ ఆచితూచి మాట్లాడారు. ఎస్టీల్లో చేర్చడం గురించి.. ప్రధానిని కలిసినప్పుడు మాట్లాడుతా అని చెప్పారు. వారి సమస్యలు తనకు తెలుసునని, వారికి అండగా ఉంటానని కూడా మాట ఇచ్చారు.

ఇకపోతే.. ఈ కార్యక్రమానికి సహజంగానే జనసేన మీడియా సెల్ మీడియా వారిని ఆహ్వానించింది. కార్యాలయం లోపల స్థలాభావం ఉన్నదని వీడియో అవుట్ కార్యాయలం వెలుపలకు ఏర్పాటుచేశాం అని.. అందరూ అక్కడినుంచి వీడియో తీసుకోవచ్చునని ఆహ్వాన ప్రకటనలోనే స్పష్టంగా చెప్పారు.

అలాగే పత్రికలకు అవసరమైన ఫోటోలను కూడా తామే విడుదల చేస్తాం అని ప్రకటించారు. అంటే వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లను లోనికి అనుమతించరన్నమాట. సహృదయంతో అర్థం చేసుకోవాలని కూడా ఆ ప్రకటనలో కోరారు.

టీవీ ఛానెళ్లు పెరిగిపోయిన తర్వాత.. ఇలాంటి ఆంక్షలు మామూలుగానే వస్తున్నాయి. కార్పొరేట్ కార్యక్రమాలు అయితే వారే వీడియోలు తీసి ఇస్తుంటారు కూడా! కానీ వీడియో అవుట్ ఇచ్చినంత మాత్రాన ఛానళ్లకు ఏం మేలు జరుగుతుంది. ఛానళ్ల వాహనాలైతే వారి ఆఫీసు దాకా వెళ్లి బయటే ఉండి సదరు వీడియోను రికార్డు చేసుకోవాలి.

దీని బదులుగా.. కాస్త వ్యయాన్ని భరించి.. శాటిలైట్ లింక్  ఇచ్చేస్తే.. ఛానళ్ల వాహనాలు జనసేన ఆఫీసు చుట్టూ మూగి.. అక్కడిదాకా తరలివచ్చి రోడ్డు మీద పడిగాపులు పడే ఖర్మకూడా వారికి తప్పుతుంది కదా.. అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఫోటోలను మెయిల్ లో పంపేయవచ్చు, వీడియోను శాటిలైట్ లింక్ ద్వారా ఇచ్చేయవచ్చు.. అక్కడితో విలేకర్ల బాధల్ని కూడా జనసేన పెద్దలు సహృదయంతో అర్థంచేసుకుని ఏర్పాటు చేయవచ్చు కదా అని పలువురు కోరుతున్నారు. అందరి కష్టాలు వినే పవన్ కు, తమ వల్ల మీడియా వారికి ఎదురవుతున్న కష్టాలు వినిపిస్తాయో లేదో.



Note: Please DO NOT use ABUSIVE language in comments.