• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

‘‘పార్లమెంటు వెలుపల గాంధీ బొమ్మ వద్ద తెలుగుదేశం ఎంపీలు ప్లకార్డులతో ధర్నా’’

‘‘లోక్ సభ స్పీకరు సుమిత్రా మహాజన్ కు తెదేపా ఎంపీల నోటీసు. అన్యాయం సరిదిద్దడంపై చర్చకు నోటీసు’’

‘‘హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ తో తెదేపా కేంద్రమంత్రులు మరియు ఎంపీల సుదీర్ఘ భేటీ’’

సోమవారం ఢిల్లీ కేంద్రంగా చోటుచేసుకున్న మూడు ప్రధానమైన పరిణామాలు ఇవే. ఇలాంటి హెడింగులు చూసినప్పుడు ఎవరికైనా ఏం అనిపిస్తుంది. రాష్ట్రానికి బడ్జెట్ లో అన్యాయం జరిగినందుకు తెలుగుదేశం చాలా తీవ్రంగానే స్పందించేస్తున్నది.. ఢిల్లీలో సర్కారుకు నోటీసులు కూడా ఇచ్చేంత తీవ్రస్థాయిలో పోరాటానికి తెరలేపింది అని అనుకోవడం సహజం. కానీ అంతా ఉత్తుత్తినే. ఇవన్నీ కేవలం ప్రజల్ని ఒక రకమైన మాయలో ముంచడానికి జరుగుతున్న ప్రయత్నాలు మాత్రమే.

ఎందుకంటే...

పైన చెప్పుకున్న మూడు పరిణామాల్లో ఒక్కటి మాత్రమే బడ్జెట్ అన్యాయానికి సంబంధించినది. పార్లమెంటు వెలుపల గాంధీ బొమ్మ వద్ద ప్లకార్డుల నిరసన. చెప్పుకోడానికి, ఫోటోలు దిగి తెలుగు మీడియాకు పంపుకోడానికి తప్ప.. గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన నిరసన సత్ఫలితాలు ఇచ్చిన దాఖలాలు భారత పార్లమెంటు చరిత్రలోనే లేవు.

ఇకపోతే.. బడ్జెట్ పై పార్లమెంటులో చర్చకు నోటీసు ఇచ్చే ఆలోచన తెదేపాకు ఉన్నట్లు లేదు. ‘అశ్వత్థామ హతః... కుంజరః’ అని మాయ చేసినట్లుగా.. ‘స్పీకరుకు నోటీసు ఇచ్చాం..’ అని బిగ్గరగా ప్రకటించి.. ‘విభజన హామీల గురించి చర్చ కోసం’ అని మెల్లగా చెబుతున్నారు ఎంపీలు. ఈ విభజన హామీల చర్చకోసం ఇచ్చిన నోటీసు ఈ నాలుగురోజుల్లోగా చర్చకు రావాలనే నిబంధన కూడా లేదు. వచ్చినా ఈ నోటు మరియు చర్చ వలన ప్రయోజనం ఉంటుందనే గ్యారంటీ కూడా లేదు.

అదే సమయంలో- రాజ్‌నాథ్‌తో భేటీ కూడా అలాంటిదే. ఈ భేటీ కూడా బడ్జెట్ అన్యాయానికి సంబంధించినది ఏమాత్రమూ కాదు. కేవలం విభజన చట్టంలో ఉన్న హామీల గురించి వాటిపై ఏపీ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాల గురించి.. ప్రాధాన్యాల గురించి తెలుసుకోవడానికి ఆయన ఏర్పాటుచేసిన భేటీ మాత్రమే. కాకపోతే.. బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది.. అంటూ ఆయన చెవిన కూడా ఓ మాటవేయడం వరకు జరిగింది.

రేపటినుంచి పోరాడేస్తాం.. ఒత్తిడి పెంచేస్తాం.. రాష్ట్రానికి రావాల్సినదెల్లా సాధించేస్తాం.. అని ఆదివారం మధ్యాహ్నం ప్రగల్భాలు పలికిన తెదేపా ఎంపీలు.. పోరాటానికి తొలిరోజు అయిన సోమవారం నాడు సాధించినదెల్లా.. గాంధీబొమ్మ ధర్నా ఒక్కటే! దీన్ని బట్టే అర్థంచేసుకోవచ్చు... వారు ఎంత ఘనంగా, ఏం సాధించబోతున్నారో!!Note: Please DO NOT use ABUSIVE language in comments.