• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే దైవాంశ సంభూతుడు, ఈదేశాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఆయన అవతరించాడు... అనే స్థాయిలో భారతీయ జనతా పార్టీలోని ఆయన భజన బృందం నాయకులు పదేపదే కీర్తిస్తూ ఉండడం ఈదేశ ప్రజలకు కొత్త కాదు. కానీ.. సాధారణంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వాజపేయి లాంటి మితవాది ఇమేజిని తమకు పాజిటివ్ గా వాడుకోవడానికి తెరముందుకు తెస్తూ ఉంటారు.

భాజపాలో మోడీ జమానా మొదలైన తరువాత.. ఉక్కుమనిషిగా పేరు గాంచిన లాల్ కృష్ణ అద్వానీని ప్రస్తుతించి.. ఇబ్బందుల్లో ఇరుక్కోవడానికి ఎవరూ ఇష్టపడడం లేదు గానీ.. అచేతనంగా ఇంటికే పరిమితమైన వాజపేయిని మాత్రం కీర్తిస్తూ ఉంటారు. మోడీ కూడా.. ఏడాదిలో కొన్ని మార్లు స్వయంగా వెళ్లి ఆయనను కలిసి తన భక్తి చాటుకుంటూ ఉంటారు.

అయితే ట్విస్టు ఏంటంటే.. సోమవారం నాడు పార్లమెంటులో తన ప్రసంగం సాక్షిగా.. మోడీని దేశంలోనే తిరుగులేని ప్రధానిగా కీర్తించే ప్రయత్నానికి ఒడిగట్టిన అమిత్ షా... ఆ ఉత్సాహంలో వాజ్ పేయిని కూడా మరచిపోయారు. మరచిపోయారో, లేదా ఉద్దేశపూర్వకంగా వాజపేయిని మించిన ప్రధాని మోడీ మాత్రమే అని ఎస్టాబ్లిష్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారో అర్థం కావడం లేదు గానీ.. ఆయన ప్రసంగం సాగిపోయింది.

పార్లమెంటులో తొలిసారిగా ప్రసంగించిన అమిత్ షా.. బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చను ప్రారంభించారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మహాద్భుతం అంటూనే.. ఈ దేశంలో లాల్ బహాదుర్ శాస్త్రి తర్వాత అంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ మాత్రమే అని కీర్తించారు.

ఈ ఉత్సాహంలో బహుశా ఆయన తమ భాజపాకే చెందిన వాజపేయి కూడా మధ్యలో కొన్నాళ్లు ప్రధానిగా పనిచేసిన సంగతిని మరచిపోయినట్లుగా ఉన్నదని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. మోడీని కీర్తించడానికి.. ఆయనకు ఎంతో సన్నిహితుడు, ఆప్తుడు, ప్రియతముడు అయిన అమిత్ షా.. తిరుగులేని పోలికలను తీసుకురావడంలో ఆశ్చర్యం లేదు గానీ.. భారతీయ జనతా పార్టీ దేవుడిలా భావించే వాజపేయి కూడా ఆయనకు గుర్తు రాకపోవడమే ఆశ్చర్యం అని పలువురు అంటున్నారు.

అయితే గుజరాత్ కు చెందిన అమిత్ షాకు గుజరాత్ నుంచి ప్రధాని అయిన వారు తప్ప.. మరెవ్వరూ సమర్థులుగా కనిపించరేమో అని కూడా ఆయన ప్రసంగం గురించి సెటైర్లు వినిపిస్తున్నాయి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.