• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రజల్లో ఇప్పుడు కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి. రాజ్యసభలో నిరసనలు తెలియజేయడాన్ని గురించి.. సభాపతి స్థానంలోని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పందిస్తున్న తీరు, చేస్తున్న కామెంట్లు.. ప్రజలకు చరిత్రను గుర్తు చేస్తున్నాయి. ఒకప్పట్లో వెంకయ్యనాయుడు కూడా ఇదే రాజ్యసభలో సభ్యుడు.

తెలుగు రాష్ట్రం గురించిన కీలక చర్చలు సభలోకి వచ్చినప్పుడు.. ఆయన చేసిన పోరాటం ప్రజలకు ఇంకా గుర్తుంది. ప్రత్యేకహోదా అనే అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు.. ఆ డిమాండు విన్న కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్.. అయిదేళ్లు ఇవ్వడానికి సిద్ధం అన్నప్పుడు.. అనాథలో ఏర్పడబోతున్న రాష్ట్రానికి అయిదేళ్ల ప్రత్యేకహోదా ఏం సరిపోతుంది.. కనీసం పదేళ్లు ఇచ్చి తీరాల్సిందే.. అంటూ వెంకయ్యనాయుడు హూంకరించిన, తన నిరసన గళాన్ని ఎలుగెత్తి చాటిన, రాజ్యసభను ఏకం చేసి పోరాడిన వైనం ప్రజలకు గుర్తుంది.

అయితే కొత్త సందేహం ఏంటంటే.. ఇదంతా కూడా వెంకయ్యనాయుడు ఆరోజుల్లో కేవలం పబ్లిసిటీ కోసమే చేశారా? కేవలం ఒక స్టంటు మాత్రమేనా? ఆరోజు ఆయన పోరాటంలో కూడా ఎలాంటి చిత్తశుద్ధిలేదా? అని అనుకుంటున్నారు.

ఎందుకంటే

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ లో జరిగిన అన్యాయం గురించి.. అలుపెరగకుండా నిరసనలు తెలియజేస్తున్నారు. ఒకవైపు శుక్రవారంనాడు సభలో వ్యవహరించిన తీరుకు పిచ్చెక్కిందా అని నిందించినా పట్టించుకోకుండా.. నా పిచ్చిని అందరూ ఎక్కించుకుని పోరాడాలి అని స్పందించిన సంగతి అందరికీ తెలుసు., అలాంటి కేవీపీ సోమవారం కూడా తన ప్లకార్డుల పోరాటం కొనసాగించారు. వెల్ లోకి వచ్చి... మౌనంగా నిల్చుని ప్లకార్డులు పట్టుకుని.. సభాపతి ఎంతగా నిలదీసినా పట్టించుకోకుండా.. నిరసనలు తెలిపారు.

అయితే ఈరోజున సభాపతి స్థానంలో ఉన్న వెంకయ్యనాయుడికి కోపం వచ్చేసింది. ‘పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారా’ అంటూ విరుచుకుపడ్డారు. పాపం.. కేవీపీ.. రాష్ట్రంలో ఆయనకసలు పార్టీనే లేదు.. ఈ టర్మ్ పదవి పూర్తయితే.. రాజకీయ జీవితం ఇక ఉంటుందో లేదో కూడా తెలియదు.. అలాంటి నాయకుడు పబ్లిసిటీ స్టంట్లు ప్లే చేసి ఏం సాధించుకుంటారు..? అనేది ప్రజల సందేహం.

వెంకయ్యనాయుడు ఈమాట అన్న వెంటనే ప్రజలకు చరిత్ర గుర్తుకు వస్తోంది. ఆరోజున రాజ్యసభలో ప్రత్యేకహోదా పదేళ్లు కావాలంటూ వెంకయ్యనాయుడు పోరాడింది కూడా పబ్లిసిటీ స్టంటేనేమో అని వారిప్పుడు అనుకుంటున్నారు. ఎందుకంటే.. ఆరోజున పోరాడారే తప్ప.. తాను అధికారంలోకి రాగానే.. అసలు ప్రత్యేకహోదా పనికేరాదు పొమ్మని తీసిపారేసిన ఘటనలు ప్రజలకు తెలుసు. ఇప్పుడిలా అంటున్నారంటే.. అప్పుడు ఆయన వ్యవహారం కూడా అదేనా అని ప్రజలు అనుకుంటున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.