• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

కేంద్ర ప్రభుత్వంతో, బీజేపీతో వ్యవహరించాల్సిన తీరుపై వ్యూహం రూపొందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు ఎందుకు రాలేదు? ఇదేదో రొటీన్‌గా నిర్వహించిన, సాధారణ విషయాలు మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేసిన సమావేశం కాదు.

కేంద్రం ఏపీకి పూర్తిగా అన్యాయం చేసిందని, ఇంకా చూస్తూనేవుందని నిరసన తెలియచేస్తూ, బీజేపీతో పొత్తు ఉండాలా? ఊడాలా? అనేది నిర్ణయించుకోవడానికి నిర్వహించిన కీలక సమావేశం. దీనికి సుజనా చౌదరి హాజరైనా, కేబినెట్‌ మంత్రి అశోక్‌ గజపతి రాజు హాజరు కాలేదు. దీనికి అసలు కారణమేంటి?  ఆయన చైనా పర్యటనకు వెళ్లి శనివారం రాత్రే ఢిల్లీకి రావడంతో ఆదివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాలేకపోయారని ఒక సమాచారం. చంద్రబాబుకు, ఆయనకు మధ్య మనస్పర్థలు ఉన్నాయి కాబట్టి రాకపోయుండొచ్చని మరో సమాచారం.

ఈరోజు పార్లమెంటు ఎదుట టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభ సమావేశం లేకపోయినా ఎంపీలు మాత్రం నిరసన ప్రదర్శన చేసి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. రేపటి నుంచే మీరు నిరసన వ్యక్తం చేయాలని చంద్రబాబు నిన్నటి పార్లమెంటరీ సమావేశంలో ఆదేశించారు కాబట్టి ఆ ప్రకారం ఈ పని చేశారు. అయితే అందుబాటులో ఉన్న మంత్రులు కూడా నిరసనలో పాల్గొనాలని బాబు చెప్పినా వారు కనబడలేదు. అశోక్‌ గజపతి రాజు పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఎందుకో రాలేదో నిర్దిష్ట సమాచారం లేకపోయినా బాబుకు, ఆయనకు మధ్య అభిప్రాయభేదాలున్నమాట వాస్తవమే. ఇవి సమసిపోయి ఇద్దరూ సామరస్యంగా ఉన్నారా? లేదా? తెలియదు.

రాజుగారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలేదని, మోదీ ఆయనకు గవర్నర్‌ పదవి ఇస్తానన్నారని ఈమధ్య ఓ పత్రికలో కథనం వచ్చింది. ఇందులో నిజమెంతోగాని, అశోక్‌ మాత్రం రాష్ట్ర సమస్యలపై  స్పందించడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయంలో చంద్రబాబూ అసంతృప్తిగా ఉన్నారు. కేంద్ర బడ్జెటులో రాష్ట్రానికి అన్యాయం చేశారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారు. అయితే బడ్జెటు పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు కేబినెట్‌ సమావేశంలో చర్చించి ఆమోదిస్తారు. అప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయం అశోక్‌ గజపతికి తెలియదా? అని కొందరు ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. అప్పుడే ఆయన అసమ్మతి ఎందుకు తెలియచేయలేదని ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడికి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి, మొత్తం మీద టీడీపీ సర్కారుకు దురదృష్టంగా అనిపిస్తున్నది కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజుకు అదృష్టంగా కనబడుతోంది. అశోక్‌కు, బాబు, తదితరులకు వేరువేరుగా కనబడుతున్న ఆ అంశమేమిటి? అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈమధ్యనే అంటే బడ్జెటు ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు 'కేంద్రంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండటం మన అదృష్టం' అని ఓ సమావేశంలో అశోక్‌ గజపతిరాజు అన్నారు.

ఆ అనుకూలత ఏమిటో బడ్జెటులో తేలిపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, రెవెన్యూ లోటు భర్తీ చేయకపోయినా, రైల్వేజోన్‌పై ఏం మాట్లాడకపోయినా, పోలవరం ప్రాజెక్టుపై ఇబ్బందులు పెడుతున్నా, రాజధాని నిర్మాణానికి అనుకున్నమేరకు సాయం చేయకపోయినా, ప్రత్యేక ప్యాకేజీ కింద అవసరమైన నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు సర్దుకుపోయారు.

ఇంత కథ నడుస్తుంటే అనుకూల ప్రభుత్వం ఉండటం అదృష్టమని అశోక్‌ గజపతిరాజు ఎందుకన్నారో...! అశోక్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఏమీ మాట్లాడటంలేదని, లాబీయింగ్‌ చేయడంలేదని చంద్రబాబు ఓసారి  పార్టీ నేతల సమావేశంలోనే అన్నారు. దీంతో కోపం తెచ్చుకున్న అశోక్‌ రాజీనామాకు సిద్ధమయ్యారని, ఆ తరువాత బాబు, ముఖ్య నేతలు సర్దిచెప్పారని ఓ పత్రిక రాసింది. అశోక్‌ గజపతిరాజు తన పనేదో తను చూసుకుంటున్నారని, ఇతర విషయాలు పట్టించుకోవడంలేదనే అభిప్రాయం బాబుకు ఉంది. పార్టీతోనూ అంటీముట్టనట్లుగా ఉంటున్నారని కొందరు నాయకులు చెబుతున్నమాట. అశోక్‌ వైఖరి అనుమానాస్పదంగా ఉన్నట్లేనా?Note: Please DO NOT use ABUSIVE language in comments.