• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఇప్పటికిప్పుడు తెలుగుదేశం పార్టీ.. గనుక భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకుంటే.. అప్పుడు భారతీయ జనతా పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపగలదు. అంతేకాదు.. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించి, జగన్ పార్టీతో కలిసి బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అది తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ అవుతుంది. అందుకే.. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ సఖ్యతతోనే మెలగడం మంచిది. బీజేపీతో సఖ్యతతో మెలిగి.. రాష్ట్రానికి కావాల్సినవి సాధించడానికి చంద్రబాబు పనిచేయాలి..’ ఇదీ ఒక ప్రముఖ టీవీ ఛానల్ విశ్లేషణ.

కోటి దీపాల ఛానల్.. తన ప్రత్యేక కార్యక్రమాలతో చెబుతున్న విషయం ఇది. మాంసం తింటున్నామని ఎముకలు మెల్లో వేసుకోవడం అంటే ఇదే కాబోలు. తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఈ మీడియా వర్గాలు.. తమ నిజరూపాన్ని ఎక్కడా దాచుకోకుండా చూపిస్తున్నాయి ఇలా విశ్లేషణలతో. పై కొటేషన్ మార్క్స్ లోని ఆ ఛానల్ విశ్లేషణ ఎంత హేయంగా ఉందో, తెలుగుదేశం పార్టీపై ఈ ఛానల్ వాళ్లకు ఎంత అపారమైన ప్రేమ ఉందో అర్థం చేసుకోవడం కష్టంకాదు.

రాష్ట్ర ప్రయోజనాలు కావాలట.. అవి, తెలుగుదేశం పార్టీతోనే రావాలట. ఒకవేళ వైసీపీ, బీజేపీ చేతులు కలిపి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ప్రకటిస్తే.. అప్పుడు రాష్ట్రానికి ప్రయోజనాలు కలగడం మాట అటుంచి, తెలుగుదేశం పార్టీకి చావుదెబ్బ పడుతుందని ఈ ఛానల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రత్యేక హోదాను చంద్రబాబే తుంగలో తొక్కేసినా, ప్యాకేజీకి కేంద్రం సున్నాచుట్టినా.. భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీనే సఖ్యతతో మెలగాలట.. వైసీపీ, బీజేపీలు చేతులు కలిపి ప్రత్యేక హోదా వచ్చినా వద్దు, టీడీపీతో బీజేపీ కలిసి నడుస్తూ విసిరే చిల్లరే చాలు అన్నట్టుగా.. పచ్చిగా.. విశ్లేషణలు చూపిస్తున్నాయి పచ్చ ఛానళ్లు.అంతేకాదు.. ఇవి జనాల్లోకి తమ అజెండాను.. అదే, చంద్రబాబు అజెండాను పక్కగా ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఎన్డీయేతో బాబు తెంచేసుకోవడం రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కారం కాదు సుమా.. అని ప్రచారం చేస్తున్నాయి.

నాలుగేళ్లుగా బీజేపీ, టీడీపీలు కలిసి రాష్ట్రానికి ఇచ్చింది మట్టి, చెంబుడు నీళ్లే తప్ప ఇంకేం లేకపోయినా.. వీళ్ల మైత్రి వర్దిల్లాలని, ఏంచేసినా బీజేపీతో చంద్రబాబు కలిసి సాగడమే ఏపీకి శ్రేయస్కరం అని.. ఈ ఛానళ్లు చెబుతున్నాయి. చంద్రబాబు విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో.. పచ్చ పార్టీ తరఫు ఛానళ్లు ఉడుతాభక్తిగా ఇలా టీడీపీని రక్షించే బాధ్యతను తీసుకున్నాయి.



Note: Please DO NOT use ABUSIVE language in comments.