• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

చిరంజీవి, పవన్ కల్యాణ్ హీరోలుగా మెగా మల్టీస్టారర్ ప్రాజెక్టు. సీనియర్ పొలిటీషియన్ సుబ్బరామిరెడ్డి ప్రకటించిన అతిభారీ బడ్జెట్ సినిమా ఇది. ఇప్పటికీ ఈ ప్రకటన వచ్చి ఏడాదయింది. సినిమా ఉండదనే విషయం కూడా దాదాపు అందరికీ తెలుసు. కానీ రెడ్డిగారు మాత్రం తగ్గట్లేదు. సినిమా తీసి తీరతానంటూ మరోసారి తనదైన స్టయిల్ లో శపథం చేశారు.

"ఈ సినిమాకు మూడో హీరో స్క్రిప్ట్. అంత చక్కనైన కథ ఇది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను దాదాపు సగం పూర్తిచేశాడు. మిగతా సగం పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఇందులో నటించేందుకు పవన్, చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు." వరంగల్ లోని వేయిస్తంభాల గుడిని దర్శించిన సుబ్బరామిరెడ్డి ఈ ప్రకటన చేశారు.

ఈ సినిమాలో చిరంజీవి నటించడేమో అనే ప్రచారం జరిగింది మొన్నటివరకు. కానీ ఇప్పుడు ఇదే చర్చ పవన్ వైపు మళ్లింది. ప్రస్తుతానికి సినిమాలపై దృష్టి లేదని పవన్ బహిరంగంగా ప్రకటించాడు. తన దృష్టి మొత్తం జనసేన పార్టీని బలోపేతం చేయడంపైనే ఉందని రీసెంట్ గా తెలిపాడు. ఈ నేపథ్యంలో పవన్, చిరుతో సినిమా చేస్తానంటూ సుబ్బరామిరెడ్డి ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిజంగా పవన్ సినిమా చేయాల్సి వస్తే సుబ్బరామిరెడ్డి కంటే ముందు మైత్రీ మూవీ మేకర్స్ కు చేసిపెట్టాలి. ఎందుకంటే వాళ్ల నుంచి అడ్వాన్స్ తీసుకున్నాడు ఈ హీరో. దాంతో పాటు ఏఎం రత్నం సమర్పణలో ఇప్పటికే ప్రారంభించిన సినిమాను పట్టాలపైకి తీసుకురావాలి. ఇవి కంప్లీట్ చేయకుండా సుబ్బరామిరెడ్డి సినిమాను పవన్ స్టార్ట్ చేస్తాడని ఎవరూ అనుకోరు.

అటు చిరంజీవి కూడా చాలా బిజీ. ప్రస్తుతం సైరా పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవి, ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. రీసెంట్ గా దర్శకుడు సుకుమార్ కూడా చిరంజీవికి ఓ కథ వినిపించినట్టు వార్తలు వచ్చాయి. సో.. ఎలా చూసుకున్నా మెగా మల్టీస్టారర్ కార్యరూపం దాల్చదు. టీఎస్ఆర్ మాత్రం ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొస్తానంటున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.