• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ఒక్కసారి గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికలను గుర్తు చేసుకోండి. మూడు దఫాలుగా అప్రతిహతంగా విజయాలు నమోదు చేస్తూ చెలరేగిపోతున్న భాజపా వైభవానికి ఈసారి తెరపడక తప్పదేమో అనిపించేంత రీతిలో హోరా హోరీగా ప్రచార పర్వం సాగింది. రాహుల్ అయితే.. జాతీయ అధ్యక్ష పదవిని స్వీకరించబోయే ముందు.. అన్ని రకాలుగా తన అర్హతను నిరూపించుకోవడానికి గుజరాత్ లో విజయం నమోదు చేయడమే కీలకం అని అనుకునేంతగా.. తహతహలాడిపోయారు.

అక్కడ అదే స్థాయిలో చాలా కష్టపడి పనిచేశారు. ఒకటో విడత పోలింగ్ సమయానికి కూడా పరిస్థితిలో మార్పులేదు. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లున్నాయి. కానీ.. అప్పుడొక చిత్రం జరిగింది. చాయ్ వాలా ప్రధానికి తమ పార్టీ మీటింగుల వద్ద చాయ్ అమ్ముకునే కాంట్రాక్టు ఇస్తాం అంటూ కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యానించారు. అంతే.. ఆ ‘‘చాయ్ వాలా’’ వ్యాఖ్య నరేంద్ర మోడీకి అద్భుతంగా కలిసి వచ్చింది.

ఆయన దాన్ని అందుకుని ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. ‘‘అవును నేను చాయ్ వాలానే..’’ అంటూ అక్కడికేదో యావత్ గుజరాతీ జాతిని అవమానించినట్లుగా, యావత్ దేశంలోని పేదలను అవమానించినట్లుగా బిల్డప్ ఇస్తూ ప్రచారంలో ప్రతిచోటా ప్రధానంగా అదే ప్రస్తావించారు. రెండో విడత పోలింగ్ జరిగిన చోట్ల చాయ్ వాలా ఆయనకు మేలు చేసిది. అక్కడే సీట్లు ఎక్కువ వచ్చాయి. మొత్తానికి బొటాబొటీగా అధికారం దక్కింది.

ఆ రకంగా ‘చాయ్‌వాలా’ వ్యాఖ్యలను వాడుకుని అధికారం సాధించిన వ్యక్తికి.. ఇప్పుడు ‘పకోడీ’ దెబ్బ తప్పేలా కనిపించడం లేదు. రాబోయే కొన్నినెలల్లో జరగనున్న ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా పకోడీ ప్రభావం ఎంతో కొంత ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇటీవల మోడీ ఓ టీవీ ఇంటర్య్వూలో మాట్లాడుతూ రోజుకు రెండు వందలు సంపాదించే పకోడీలు అమ్ముకునే వ్యక్తిని నిరుద్యోగి అనలేం అంటూ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు చదువుకున్న నిరుద్యోగుల్ని బాధించాయి. ప్రధానంగా ప్రభుత్వోద్యోగాలు, కాకపోతే.. తమ అర్హతలకు తగినట్లుగా ప్రైవేటు ఉద్యోగాలు కావాలని ఎవరైనా కోరుకుంటారు. అంతేతప్ప.. పీజీలు, పీహెచ్డీలు చేసేసి పకోడీలు అమ్ముకుంటూ బతకాలని కోరుకోరు. అలాంటి నేపథ్యంలో నిరుద్యోగ భారతాన్ని మొత్తం అవమానించినట్లుగా మోడీ వ్యాఖ్యలు ఉన్నాయనే విమర్శలు జోరందుకున్నాయి.

సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి నేపథ్యంలో ఆదివారం బెంగుళూరు వచ్చిన మోడీకి.. అక్కడి నిరుద్యోగులు వెరైటీగా నిరసన తెలిపారు. సభ జరుగుతోంటే.. గ్రౌండ్ బయట.. మోడీ పకోడీలు, అమిత్ షా పకోడీలు అమ్ముతూ జనం దృష్టిని ఆకర్షించారు. యూనివర్సిటీ కాన్వొకేషన్ కు వేసుకునే.. ప్రత్యేకమైన దుస్తులు ధరించి నిరుద్యోగులు ఇలా పకోడీలు అమ్మడం.. అందరినీ ఆకర్షించింది.

మరి యువతలో రగులుతున్న ఇలాంటి ఆగ్రహజ్వాలలు.. మోడీకి ఎన్నికల్లో కూడా పకోడీ దెబ్బను రుచిచూపిస్తాయా? చాయ్ ప్రచారంతా తన విజయాలకు పునాదులు వేసుకునే మోడీకి, పకోడీ ప్రచారం చేదు ఫలితాలను చూపిస్తుందా అని పలువురు విశ్లేషిస్తున్నారు.Note: Please DO NOT use ABUSIVE language in comments.