• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

శతృవు శతృవు తమకు మిత్రుడు అన్నట్లుంది వ్యవహారం. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 హడావుడి వైకాపా అభిమానులను, బాబు అంటే కిట్టని వారిని చాలా ఆనందపరుస్తోందట. అదేంటీ ఈ కొత్త ఈక్వేషన్ అంటే..అదంతే అంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం మొత్తం చంద్రబాబుకు మాగ్జిమమ్ సహకరించింది. ఇప్పుడు ముద్రగడ ఇస్యూ, వంగవీటి వ్యవహారం, లేటెస్ట్ గా ఖైదీ సినిమా సభకు, థియేటర్లకు అడ్డంకులు సృష్టించడం వంటి వాటి వల్ల చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారుతోందని వీరు భావిస్తున్నారు.

చిరంజీవి ఎంతబలపడితే, బాబుకు, పవన్ కు కూడా అంత నష్టం అని అంచనా వేస్తున్నారు. 2019 నాటికి భాజపాను వీలయినంత కిందకు తొక్కి, బాబు-పవన్ కలిసి ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాము వదిలేసే ముందుగానే, భాజపా అటు వైకాపాకు కానీ, ఇటు చిరంజీవికి కానీ పనికి రాకుండా చేయడమే పవన్- బాబుల సీక్రెట్ అజెండా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాపులు కనుక బాబుకు దూరంగా వున్నారన్నది క్లియర్ అయితే పవన్ కూడా అటు వెళ్లడానికి జంకే అవకాశం వుంది. లేదా పవన్ వెళ్లినా కూడా వైకాపాకు అంతగా నష్టం రాని పరిస్థితి వుంటుందని అంచనా వేస్తున్నారు.

'చిరంజీవి చరిష్మా ఎంత పెరిగితే పవన్ కళ్యాణ్ కు అంత మైనస్. కాపులు పవన్ వెంట కన్నా, ముద్రగడకు చిరంజీవి మద్దతు ఇస్తున్నందున కాపులు ఇటే వుండే అవకాశం వుందని కొందరు వైకాపా నేతలు పేర్కొనడం విశేషం. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ 2019లో చంద్రబాబు చేయి వదలరని, అది కాపులకు నచ్చే విషయం కాదని, అందువల్ల వారు చిరు వైపే వుంటారని అంటున్నారు. చిరు రాజకీయంగా పోటీ చేసినా, చేయకున్నా, బాబుకు వ్యతిరేకంగా వుంటే చాలన్నారు.

ఖైదీ 150 సినిమా విషయంలో బాబు అండ్ కో వ్యవహరిస్తున్న తీరు కచ్చితంగా 2019 లో ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. చిరు కూడా ఊహించనంత రెస్పాన్స్ ఖైదీ 150 సినిమా విషయంలో రావడం వెనుక బాబుపై కాపుల అసంతృప్తి కచ్చితంగా వుందన్నది వీరి వాదన. వైకాపా నేత జగన్ కు చెందిన సాక్షి దినపత్రికకు ప్రత్యేకంగా చిరు తొలి ఇంటర్వూ ఇవ్వడం, అలాగే సాక్షి చానెల్ కోసం వైకాపా నేత రోజానే స్వయంగా చిరును ఇంటర్వూ చేయడం ఇవన్నీ మారబోతున్న ఈక్వేషన్లు గా చూడాలని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వూలో కూడా ప్రస్తుత ప్రభుత్వాలు స్కాములు కప్పి పుచ్చుతున్నాయని, కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించాయని చిరు స్మూత్ గా చురకలు వేయడం గమనార్హం.

సో,. దానా దీనా బాబు ఫ్యామిలీకి చెందిన శాతకర్ణికి పోటీగా రావడం, చిరు సినిమాకు బాబు అండ్ కో ఇబ్బందులు కలుగచేయడం, ఈ నేపథ్యంలో ఆ సినిమాకు మాంచి బజ్ రావడంతో బాబు వ్యతిరేకులు, వైకాపా అభిమానులు కాస్త లోలోపలే ఎక్సయిట్ అవుతున్నారన్నది వాస్తవం.



Note: Please DO NOT use ABUSIVE language in comments.