• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

సినిమా ఎలా వుంది.? అన్నది వేరే విషయం. అభిమానులకైతే, తెరపై తమ అభిమాన హీరో ఎలా వున్నాడో చూద్దామనే ఉత్కంఠ మాత్రం నరాలు తెగిపోయేలా వుంది. ఆ ఉత్కంఠతోనే అభిమానులు థియేటర్లకు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో మేగ్జిమమ్‌ థియేటర్లలో చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా విడుదలవుతున్న విషయం విదితమే. నిన్న అర్థరాత్రికి ముందే బెనిఫిట్‌ షోల కోసం అభిమానులు ప్రయత్నించారుగానీ, చాలా చోట్ల కుదరలేదు. పోలీసుల ఆంక్షల నడుమ అభిమానుల ఉత్సాహం ఉస్సూరుమంది. అయితేనేం, జాగారం చేయడానికైనా అభిమానులు సిద్ధమయిపోయారు. 

ఎలాగైతేనేం, చాలా చోట్ల తెల్లవారు ఝామున 4 గంటలకు బెనిఫిట్‌ షోలు షురూ అయ్యాయి. ఇకనేం, అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. 'సినిమా సూపర్‌ హిట్‌' అనే డైలాగ్‌ అభిమానుల నుంచి రావడం కొత్తేమీ కాదు. ఆ విషయం పక్కన పెడితే, 'బాస్‌ ఈజ్‌ బ్యాక్‌..' అంటూ నినాదాలతో ఊగిపోయారు. తమ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చిరంజీవి కన్పించారంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయారు. 

ఇక, అభిమానుల హంగామాతో తలెత్తిన ట్రాఫిక్‌ సమస్యలతో పోలీసులు నానా తంటాలూ పడాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. అన్నట్టు, బెనిఫిట్‌ షోల పేరుతో అభిమానుల జేబులకు చిల్లులు బాగానే పడ్డాయి. రికార్డు స్థాయిలో బెనిఫిట్‌ షో టిక్కెట్ల ధరలు పలికేశాయి. 

అభిమానుల హంగామా, వారి నుంచి వస్తోన్న టాక్‌ సంగతి పక్కన పెడితే, దాదాపు పదేళ్ళ తర్వాత చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా కావడంతో సగటు తెలుగు సినీ ప్రేక్షకుడిలో 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాపై ఉత్కంఠ సహజమే. ఇంతకీ, 'ఖైదీ' సినిమా అంచనాల్ని అందుకునేలా వుందా.? అంచనాల్ని మించిపోయిందా.? అసలేంటి 'ఖైదీ' సంగతి.? అన్నది తెలియాలంటే మార్నింగ్‌ షో పూర్తయ్యేదాకా వేచి చూడాల్సిందే.

 



Note: Please DO NOT use ABUSIVE language in comments.