• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్న విషయం విదితమే. బాలకృష్ణ 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాతో జనవరి 12న ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అటు చిరంజీవికీ, ఇటు బాలకృష్ణకీ.. వారివారి చిత్రాలు అత్యంత ప్రతిష్టాత్మకం. తొమ్మిదేళ్ళ తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'ఖైదీ' కాగా, బాలకృష్ణ 100వ చిత్రం 'శాతకర్ణి'. దాంతో ఇరువురి అభిమానుల్లోనూ తమ అభిమాన హీరోల నుంచి సంక్రాంతికి వస్తోన్న సినిమాలు చారిత్రక విజయాల్ని సాధించాలనే ఉత్కంఠ వుండడం సహజమే. 

ఇక, చిరంజీవి సినిమా ఆడియో ఫంక్షన్‌కీ, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కీ ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్‌ అడ్డు తగలడం, అధికార పార్టీ ఎమ్మెల్యేగా బాలకృష్ణ పనిచేస్తుండడం, అదే సమయంలో విపక్షంలో వున్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి చిరంజీవి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తుండడం.. ఇదంతా వెరసి, పొలిటికల్‌ కలర్‌ కూడా ఈ రెండు సినిమాలకీ అంటేసింది. పోటా పోటీగా ఈ రెండు సినిమాలూ విడుదలవుతున్నాయన్నది నిర్వివాదాంశం. ముందుగా 13న 'ఖైదీ' అనుకున్నా, దాన్ని 11వ తేదీకి మార్చారు. ఈ మార్పు వెనుక, 'శాతకర్ణి'ని దెబ్బతీసే ఉద్దేశ్యం వుందన్నది ఓ వాదన. అబ్బే, అదేం లేదని నిన్న 'ఖైదీ' నిర్మాత చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు. మరోపక్క, తాజాగా 'శాతకర్ణి' డైరెక్టర్‌ క్రిష్‌, ఈ సంక్రాంతికి రెండు సినిమాల్నీ ఆదరించాలంటూ తెలుగు ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు. ఇటు చరణ్‌నీ, అటు క్రిష్‌నీ ఈ విషయంలో అభినందించి తీరాల్సిందే. 

ఎలాగూ 'శాతకర్ణి' ప్రారంభోత్సవానికి చిరంజీవి వెళ్ళారు గనుక, 'ఖైదీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బాలకృష్ణకీ విషెస్‌ చెప్పేస్తే హుందాగా వుంటుంది. అదే సమయంలో, బాలకృష్ణ తరఫు నుంచి కూడా చిరంజీవికి ఓ 'వెల్‌కమ్‌' వచ్చేస్తే.. అభిమానుల్లో నెలకొన్న 'సెగలు' దాదాపుగా చల్లారిపోతాయి. అది రెండు సినిమాలకీ ఎంతో మంచిదన్నది నిర్వివాదాంశం. బాలీవుడ్‌లో షారుక్‌, సల్మాన్‌, అమీర్‌ఖాన్‌ మధ్య వివాదాలున్నా, సినిమాల కోసం అందరూ కలిసిపోతుంటారు. ఆ ట్రెండ్‌ టాలీవుడ్‌లో కూడా వస్తే ఎంత బాగుంటుందో కదూ.! 



Note: Please DO NOT use ABUSIVE language in comments.