• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు గౌతమ్. ఐతే పుష్కరం కిందటే అరంగేట్రం చేసినా ఇప్పటిదాకా నిలదొక్కుకోలేకపోయాడు గౌతమ్. ఇప్పటిదాకా అతను చేసింది మూడే మూడు సినిమాలు. అందులో ఏదీ ఆకట్టుకోలేదు. చివరగా ‘బసంతి’ అనే సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుని.. బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేశారు. కానీ అది కూడా ఆకట్టుకోలేదు. ఇప్పుడు అతను ‘మను’ అనే వైవిధ్యమైన సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే రిలీజైన ‘మను’ టీజర్ భలే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు చాలానే ఉన్నాయి.

ఫణీంద్ర నరిశెట్టి అనే కొత్త దర్శకుడు ‘మను’ను రూపొందించాడు. ఫణీంద్ర ఇండస్ట్రీకి కొత్తవాడే కానీ.. సోషల్ మీడియాలో అతను ఇప్పటికే బాగా పాపులర్. ‘మధురం’ అనే షార్ట్ ఫిల్మ్ తో అతను మంచి పేరు సంపాదించాడు. అవ్వడానికి షార్ట్ ఫిల్మే కానీ.. అది ఫీచర్ ఫిల్మ్ కి ఏమాత్రం తగ్గదు. ఇంకా రెండు వేరే షార్ట్ ఫిల్మ్స్ తోనూ ఆకట్టుకున్నాడు ఫణీంద్ర. తన షార్ట్ ఫిల్మ్స్ ను క్రౌడ్ ఫండింగ్ తో పూర్తి చేసిన ఫణీంద్ర.. తన సినిమాకు కూడా అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా ద్వారా డబ్బులు సమీకరించి ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఇక టీజర్ విషయానికి వస్తే.. టెక్నికల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కనిపిస్తున్నాయి. విజువల్స్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. ఇదేదో డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కిన సినిమా లాగా ఉంది. పరిమిత పాత్రలతో.. తక్కువ లొకేషన్లలో సినిమాను పూర్తి చేసినట్లున్నాడు ఫణీంద్ర. ఈ చిత్రంలో గౌతమ్ కు జోడీగా చాందిని చౌదరి నటించింది.



Note: Please DO NOT use ABUSIVE language in comments.