• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రాజెక్టుల నిర్మాణానికి చంద్రబాబు చేసిందేమీ లేదని... ఆయన హయాంలో ఇచ్చిన నిధులు ఏమూలకూ చాల్లేదని.. వైఎస్ రాజశేఖరరెడ్డి భారీగా నిధులిచ్చి వాటిని పూర్తి చేస్తే చంద్రబాబు ఇప్పుడవన్నీ తాను నిర్మించినవేనని చెప్పుకొంటున్నారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు.   ప్రాజెక్టులకు శంకుస్థాపనలంటూ కొబ్బరికాయలు  కొట్టి పోవడం తప్ప చంద్రబాబునాయుడు వాటి నిర్మాణానికి డబ్బులు ఎప్పుడైనా ఇచ్చారా? అంటూ  జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం పులివెందులలో నిర్వహించిన రైతు మహాధర్నాలో జగన్ మాట్లాడారు.  తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు - గాలేరు నగరి ప్రాజెక్టుకు కేవలం రూ. 13 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ముష్టి వేసినట్టుగా రూ. 17 కోట్లు ఇచ్చారని అన్నారు.  వైఎస్ సీఎం అయిన తరువాతనే ప్రాజెక్టులకు నిధులు పెరిగి పనులు వేగవంతమయ్యాయని చెప్పారు. హంద్రీనీవాకు రూ. 4 వేల కోట్లు - గాలేరు నగరికి దాదాపు రూ. 4 వేల కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగొచ్చిన చంద్రబాబు ఆ ప్రాజెక్టులను తానే కట్టించినట్టు ఫోజు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. 
    
రాయలసీమ వాసులపై చంద్రబాబునాయుడు సవతి ప్రేమను చూపుతున్నారని - చిత్రావతి - శ్రీశైలం ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరున్నా - ఈ ప్రాంత వాసుల కష్టాలు తీర్చేలా నీటిని విడుదల చేయడం లేదని జగన్ ఆరోపించారు.  పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరు ఎక్కడ తెచ్చారో చూపాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ నుంచి 48 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వెళ్లిపోయాయని అంతకుమించి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు. పట్టి సీమ కట్టా రాయలసీమకు నీటిని తెచ్చానంటూ బిల్డప్ ఇస్తున్న చంద్రబాబు నిత్యమూ అబద్ధాలు - అసత్యాలు చెబుతూ - ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. 
    
తన ప్రశ్నలకు అధికార పక్షం వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు. పట్టిసీమ నుంచి తరలిస్తున్న నీటి మేరకు శ్రీశైలం నీటిని రాయలసీమకు ఇచ్చేలా జీవోను ఎందుకు జారీ చేయలేదని జగన్ అడిగారు. పట్టిసీమకు ఖర్చు చేసిన రూ. 1600 కోట్లలో రూ. 1300 కోట్లు ఖర్చు పెట్టినా నేడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి అయి - కడప - అనంతపురం జిల్లాలు సస్యశ్యామలం అయి ఉండేవని అన్నారు. తలా తోకా లేని పాలన కాదా ఇది? అంటూ ప్రశ్నించారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.