• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లికి ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తాననే ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆశ్చర్యపోయారు. బడ్జెట్ పరంగా ప్రభుత్వంపై ఇది చాలా పెద్దభారం అవుతుందని అంతా అనుకున్నారు. గెలిచి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత... ఈ పథకానికి షరతులు వర్తించేలా చూస్తారని నిజంగా పేద వర్గాలకు మాత్రమే లబ్ధిదక్కేలా చేస్తే మంచిదేనని కూడా కొందరు అనుకున్నారు. కానీ.. జగన్ సీఎం అయిన తరువాత ఈ హామీని అమల్లో పెడుతున్న తీరు... పలువురిని విస్మయ పరుస్తోంది.

పాఠశాలకు పిల్లల్ని పంపే తల్లులకు 15వేలు ఇస్తానని జగన్ ప్రకటించారు. ఇప్పుడు ప్రభుత్వ, ప్రెవేటు స్కూళ్లకు కూడా వెళ్లే అందరు పిల్లలకు ఈ హామీ వర్తిస్తుందనే మాట వినవస్తోంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు కూడా. అయితే ఈ నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల నడ్డి విరిచేలా... చిన్న చిన్న గ్రామాల్లో కూడా స్థాయిలేని ప్రెవేటు పాఠశాలలు వెలిసేలా... ప్రెవేటు పాఠశాలల విచ్చలవిడి దోపిడీకి సహకరించేలా ఉన్నదనే విమర్శలు వినవస్తున్నాయి.

ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులకు మాత్రం ఈ నగదు కానుక అందిస్తే అది ఓ తరహాగా ఉండేది. ఇవాళ్టి రోజుల్లో జరుగుబాటుకు ఇబ్బందిగా ఉన్న కుటుంబాల వారు మాత్రమే, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. మూడుపూటల తినగలిగే స్తోమత ఉంటే చాలు... పిల్లలను ప్రెవేటు స్కూళ్లలో చేర్చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పేదలు తమ పిల్లలను బడి మాన్పించకుండా ప్రోత్సహించడమే గనుక జగన్ ఉద్దేశం అయితే... ప్రభుత్వ పాఠశాలలకు పంపే వారికి ఈ సాయం అందించాలి. అంతే తప్ప... ప్రెవేటు పాఠశాలలు గంపగుత్తగా దోచుకోడానికి ఈ పథకం గేట్లు తెరుస్తుందా? అనిపిస్తోంది.

పైగా జగన్ ప్రెవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు వెనుకబడిన వారికి ఇవ్వాలని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. మితిమీరిన లాభార్జన మీద ధ్యాసతో తామర తంపరగా పుట్టుకొచ్చిన ప్రెవేటు స్కూళ్లు పోటీ తట్టుకోలేక కుములుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి... ఏడాదికి 15 వేలు తల్లులకు ఇవ్వాలే గానీ... ఆ సొమ్ము ఫీజుగా జమ చేసుకునేలాగా.. 25శాతం సీట్లేం ఖర్మ.. మొత్తం వందశాతం సీట్లనూ పేదలకే కేటాయించే స్కూళ్లు కూడా పుట్టుకొస్తాయి. జగన్మోహన రెడ్డి చేసిన మంచి ఆలోచన ఆచరణలో పెడదారి పట్టిపోకుండా... కొన్ని నిర్దిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.Note: Please DO NOT use ABUSIVE language in comments.