• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికలకు పూర్వం నరేంద్రమోడీకి ఉన్న హవా వేరు... ప్రధాని అయిన తర్వాత.. 2019 ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో ఆయన సంపాదించుకుంటున్న కీర్తి ప్రతిష్టలు వేరు. మొత్తానికి గతానికి ఇప్పటికి మోడీ హవా పతనం అవుతున్నదనేది అందరూ అంగీకరిస్తున్న విషయం. నిజానికి ఈ తరుణంలో భారతీయ జనతాపార్టీ మరోసారి అధికారం పగ్గాలు చేపట్టాలని అనుకుంటే గనుక... వారికి మిత్రపక్షాల మద్దతు చాలా అవసరం. కానీ, ఆ మిత్రపక్షాలు కూడా ఒక్కరొక్కరుగా భాజపాను వీడిపోతున్న పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇదంతా మోడీ హవా పతనం అవుతున్నదనడానికి సంకేతాలే అనుకోవాల్సి వస్తోంది.

ఎన్డీయే ఎంత పెద్దకూటమి అయినప్పటికీ.. అందులో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ... భారతీయ జనతాపార్టీ తర్వాత అతి పెద్ద పార్టీలుగా శివసేన, తెలుగుదేశం వంటివే మొన్నటివరకూ ఉన్నాయి. ఇటీవలి పరిణామాల్లో తెలుగుదేశం వారికి పూర్తిగా దూరం అయింది. శివసేన, నామ్ కే వాస్తే భాగస్వామి పార్టీగా ఉన్నదే తప్ప... ప్రతి సందర్భంలోనూ భాజపాపై విమర్శలు కురిపిస్తూనే ఉంది. తాజాగా శివసేన అధినేత, ఉద్ధవ్ ఠాక్రే మాటలు నిజానికి భాజపాకు కలవరం పుట్టించేలాగానే ఉన్నాయి.

ఇకమీదట ఏ ఎన్నికల్లో అయినా తాము ఒంటరిగానే బరిలోకి దిగుతాం అని, భాజపాతో కలిసి పోటీచేసే పరిస్థితి ఉండదని ఉద్ధవ్ ఠాక్రే అంటున్నారు. గత ఎన్నికల్లో భాజపాకు సొంతంగానే అధికారంలోకి రాగల మెజారిటీ దక్కింది. కానీ.. మారిన పరిస్థితుల్లో.. మోడీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఫలితమాని.. ఈదఫా అన్ని సీట్లు ఖచ్చితంగా ఆ పార్టీకి దక్కే అవకాశం మాత్రం ఉండదు. ఇలాంటి సందర్భంలోనే వారికి మిత్రుల అవసరం పెరుగుతుంది.

కానీ, తెలుగుదేశం, శివసేన వంటి పెద్దపార్టీలు ఈసారి ఎన్డీయే కూటమిలో ఉండవన్నది ఖరారు. భాజపా కూడా వీరిని నమ్ముకోకుండా తమ ముందు జాగ్రత్తల్లో తాము ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. బీహార్ లో ప్రజాదరణ ఉన్న నితీశ్ కుమార్ వంటి వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాజపా బిజీగా ఉంది.

ఈ సంకేతాలు అన్నీ మోడీ హవా పతనం అవుతున్నదనడానికి నిదర్శనాలే. భాజపా తాము తిరుగులేని మెజారిటీతో మళ్లీ గద్దెమీదికి వస్తాం అని పదేపదే చెబుతున్నప్పటికీ... అదంతా మేకపోతు గాంభీర్యమేనని... పెద్ద పార్టీల అండలేకుండా ఈసారి ఏకపక్షంగా ఎన్డీయే అధికారంలోకి రాలేకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.



Note: Please DO NOT use ABUSIVE language in comments.