• Home
  • |
  • About Us
  • |
  • Contact Us
  • |
  • Login
  • |
  • Subscribe

జ‌గ‌న్‌కు వేరే శ‌త్రువులు అక్కర్లేద‌నుకుంటా. ఎందుకంటే ఆయ‌న‌కు ఆయ‌నే శ‌త్రువులా క‌నిపిస్తున్నారు. ఇటీవ‌ల రాష్ర్ట రాజ‌కీయాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను జాగ్రత్తగా ప‌రిశీలిస్తే జ‌గ‌న్ విష‌యంలో ఈ అభిప్రాయం క‌లుగుతోంది. సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్రతి అంశాన్ని రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ప్రతి రాజ‌కీయ పార్టీ పావులు క‌దుపుతుంది.  రాష్ర్టంలో ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిప‌క్ష వైసీపీ, జ‌న‌సేన పార్టీలున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎలాంటి ష‌ర‌తుల్లేకుండా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ మ‌ద్దతు ఇచ్చారు. టీడీపీ-బీజేపీ క‌ల‌సి రాష్ర్టంలో, దేశంలో అధికారాన్ని పంచుకున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ కూడా నాలుగేళ్ల పాటు టీడీపీని వెనుకేసుకొచ్చారు.

విభ‌జ‌న హామీల్లో ప్రధానంగా ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా ప్రతిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు చేస్తూ వ‌చ్చారు. యువ‌భేరీలు, నిర‌శ‌న కార్యక్రమాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం హోదావ‌ద్దు ప్యాకేజీ ముద్దు అని అంటే సీఎం చంద్రబాబు మీ ఇష్టమే నా ఇష్టమ‌న్నారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధ‌న్యవాదాలు తెలుపుతూ అసెంబ్లీలో తీర్మానం, నాటి కేంద్రమంత్రి వెంక‌య్యనాయుడుతో పాటు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి స‌త్కారాలు తాజా జ్ఞాప‌కాలే. అయితే ప్రత్యే్కహోదా ఇవ్వని కేంద్రంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ సూచ‌న మేర‌కు జ‌గ‌న్ అవిశ్వాస తీర్మానం పెట్టడం, టీడీపీ కూడా అదే బాట‌లో న‌డ‌వ‌డం, దేశ‌స్థాయిలో సంచ‌ల‌నం క‌లిగించాయి.

ప్రత్యే్కహోదా అంశం, పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం దేశాన్ని ఒక కుదుపు కుదిపాయ‌ని చెప్పవ‌చ్చు. ఆ త‌ర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయ‌డం, ఆమోదించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ప్రస్తుతం పార్లమెంట్ వ‌ర్షాకాల‌ స‌మావేశాల‌కు స‌మ‌యం ఆస‌న్నమైంది. బుధ‌వారం ప్రారంభం కానున్న పార్లమెంట్ స‌మావేశాల్లో కాంగ్రెస్ స‌హా టీడీపీ మ‌ళ్లీ అవిశ్వాస తీర్మానం ప్రవేశం పెట్టేందుకు సిద్ధమ‌య్యాయి. దీంతో  ఢిల్లీలో వేడి రాజుకొంది. ఒకవైపు టీడీపీ క‌మిటీలు ఏర్పాటు చేసుకొని అవిశ్వాస తీర్మానానికి మ‌ద్దతు కూడ‌గ‌డుతూ ప్రత్యేకహోదా కోసం ఏదో చేస్తున్న భ్రమ క‌లిగిస్తుంటే, ప్రతిప‌క్ష వైసీపీ చేష్టలుడిగి చూస్తుండ‌టం ఒకింత ఆశ్యర్యం క‌లుగుతోంది.

అస‌లు ప్రత్యేకహోదా కోసం మొద‌టి నుంచి ఉద్యమిస్తున్న జ‌గ‌న్ యుద్ధంలో చివ‌రి ఘ‌ట్టానికి వ‌చ్చేస‌రికి ఆయుధాల‌న్నీ దుర్వినియోగం చేయ‌డం వారి రాజ‌కీయ అజ్ఞానానికి, తొంద‌ర‌పాటుకు నిద‌ర్శన‌మ‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. కేవ‌లం పార్లమెంట్ ఆవ‌ర‌ణ‌లో స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు త‌మ తాజా మాజీ ఎంపీలు నిర‌స‌న కార్యక్రమాలు చేస్తార‌ని వైసీపీ అధిష్టానం ప్రక‌టించింది. పార్లమెంట్‌లో ఉండి పోరాడేందుకు అవ‌కాశం ఉన్న ప‌ద‌వుల‌ను త్యజించి ఇప్పుడేదో చేస్తామ‌న‌డం ఏ విధంగా స‌మ‌ర్థనీయం. అటు పార్లమెంట్‌కు వెళ్లక‌, ఇటు అసెంబ్లీకి రాని వైసీపీ మ‌న‌కు అవ‌స‌ర‌మా అని సీఎం చంద్రబాబు ప్రజ‌ల్లో ఆలోచ‌న క‌లిగేలా ప్రశ్నల‌ను సంధిస్తున్నారు. దీనికి వైసీపీ ఏం స‌మాధాన‌మిస్తుంది.

జ‌గ‌న్ వైఖ‌రితో వైసీపీ శ్రేణులు సైతం సంతోషంగాలేవు. త‌మ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని టీవీ చ‌ర్చల్లో, ఇత‌ర వేదిక‌ల‌పై వైసీపీ నేత‌లు త‌ప్పనిస‌రి ప‌రిస్థితుల్లో స‌మ‌ర్థిస్తున్నారు. జ‌గ‌న్ ప్రారంభించిన ప్రత్యేకహోదా ఉద్యమాన్ని చంద్రబాబు నాలుగేళ్ల త‌ర్వాత అందుకుని త‌న పాల‌న‌లోని వైఫ‌ల్యాలు మ‌రుగున ప‌డేలా ఎత్తుగ‌డ వేశారు. ప్రజ‌ల్లో బీజేపీతో పాటు త‌న‌పై ఉన్న వ్యతిరేక‌త‌ను కూడా మోడీపై మ‌ళ్లించేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగ‌డ కొంతమేర స‌త్ఫలితాల‌ను ఇచ్చింద‌నే చెప్పవ‌చ్చు. అంతేకాదు రాష్ర్టానికి అన్యాయం చేసిన మోడీతో జ‌గ‌న్, ప‌వ‌న్ అంట‌కాగుతున్నార‌నే ప్రచారాన్ని ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళుతున్నారు. దీంతో వైసీపీ ఆత్మర‌క్షణ‌లో ప‌డింద‌నే చెప్పాలి. దీనికి ముమ్మాటికీ జ‌గ‌న్ వైఖ‌రే కార‌ణ‌మ‌ని చెప్పవ‌చ్చు.

ప్రజాభీష్టంతో సంబంధం లేకుండా మోడీని విస్మరించి కేవ‌లం చంద్రబాబును మాత్రమే త‌న ప్రసంగాల్లో జ‌గ‌న్ టార్గెట్ చేస్తున్నారు. ఇది జ‌నానికి అంత రుచించ‌డం లేదు. పార్లమెంట్‌తో పాటు స‌మానంగా ప్రారంభం కానున్న అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ త‌న గ‌ళాన్ని స‌మ‌ర్థవంతంగా జ‌నంలోకి తీసుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకుపోతోంది. ఈ ప‌రిణామాల‌తో త‌న‌కేమీ సంబంధం లేన‌ట్టుగా రోడ్లంబ‌డి జ‌గ‌న్ న‌డుచుకుంటూ వెళుతున్నార‌నే ఆవేద‌న ఆ పార్టీ శ్రేణుల్లో బ‌లంగా ఉంది.

వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయ‌క‌పోయినా, ఇదే వైఖ‌రితో ముందుకెళ్లినా ఆ పార్టీని దేవుడు కూడా కాపాడ‌లేర‌నేది ప‌చ్చినిజం. జ‌గ‌న్ జ‌నాన్ని కాపాడ‌టం త‌ర్వాత సంగ‌తి, ముందు త‌న‌ను తాను కాపాడుకునేందుకైనా ఇంత వ‌ర‌కు చేసిన త‌ప్పిదాలు పున‌రావృతం కాకుండా తెలివిగా నడుచుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.Note: Please DO NOT use ABUSIVE language in comments.